
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెబుతుంటారు కదా, సృష్టిలో జరిగే ప్రతి విషయానికి మూలం శివుడే. ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యామి. శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో చెప్పడం అసంభవం. ఆయనకు పుట్టుక, చావు రెండూ లేవు. సరిగ్గా ఈ మాట అన్నప్పుడే, శివుడు ఎప్పుడు పుట్టాడు? ఎవరికి పుట్టాడన్న ప్రశ్నబయలుదేరుతుంది.. ఈ ప్రశ్నకు పండితులు ఏం చెబుతున్నారు.. పురాణాల్లో ఏముందో తెలుసుకుందాం. .
శివుడు ఆది దేవుడు, స్వయంభు. ఆయనకు తల్లిదండ్రులు లేరు. స్వయంభు అంటే తనంతట తానుగా వచ్చినవాడని అర్థం. ఈ సృష్టే శివరూపం కాబట్టి, శివుడు ఎవ్వరికీ పుట్టలేదని చెప్పాలి. ఈ జగత్తుకు తండ్రి శివుడు. సమస్త జగత్తు శివుడి నుంచి పుట్టినది అని చెబుతుంది శివ పురాణం. సృష్టిలోని ప్రతిదీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతుంది.
హిందూ మంతంలో మూడున్నర కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు. బ్రహ్మా. విష్ణు, మహేశ్వరుడు (మహా శివుడు) త్రిమూర్తులు. త్రిమూర్తుల్లో శివుడు మహాదేవుడు. మూడున్నర కోట్ల మంది దేవుళ్లకు, బ్రహ్మా, విష్ణుమూర్తులకు కూడా శివుడు దేవుడు. విష్ణువు, బ్రహ్మా కూడా శివలింగారాధన చేస్తుంటారు.
శివ.. శివ.. కొత్త మంత్రం
శివుడు ఎలాగైతే అందరినీ దగ్గరకు తీసుకుంటాడో, అలాగే అందరినీ క్షమించగలడు . ప్రస్తుతం హైటెక్ యుగంలో.. ప్రతీ విషయానికి కోప్పడేవాళ్లను, నిరుత్సాహపడే వాళ్లను చూస్తున్నాం. అన్నింటికీ గట్టిగా అరిచేవాళ్లనూ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ..ఓం నమః శివాయ.. అనే ఒక మంత్రాన్ని నెమ్మదిగా చదువుకోండి. ఈ మంత్రం ప్రశాంతతను తీసుకొస్తుంది.
కాబట్టి ఈ సారెప్పుడైనా కోపమొస్తే, గట్టిగా ఒక ఇంగ్లిషు మాటతో అరవకుండా, ప్రశాంతంగా 'శివ' అనండి. అలాగే ఏదైనా మంచి జరిగినా, 'శివ' అనండి. శివుడి గుణాలు ఎన్ని తెలుసుకున్నా, దాన్నుంచి వచ్చే శివ తత్త్వాన్ని ఎంత అర్థం చేసుకున్నా అవన్నీ ఈ ఒక్క మంత్రంలో మీకు ప్రశాంతతను తీసుకురాగలిగితే, శివుడ్ని మీరు అర్థం చేసుకున్నట్టే. శివం.. శంకరం.. అన్న మాటల్లోనే శివతత్త్వం అంతా దాగి ఉంది. మంచి, శాంతి మంత్రాలన్నీ ఈ ఒక్క మాటలోనే దాగున్నాయి.