గాంధీ@150.. పరాయి దేశంలోనూ పట్టు

కేసులు పెద్దగా లేని ఓ యావరేజ్​​ లాయర్​గా దేశాన్ని విడిచివెళ్లిన వ్యక్తి… సక్సెస్​ఫుల్​ పీపుల్​ లీడర్​గా ఇండియాకి తిరిగి రావడాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, అనుభవాలే తదుపరి కాలంలో ఇండియాలో ఉపయోగపడ్డాయని గాంధీజీ తన ఆత్మకథ ‘మై ఎక్స్​పెరిమెంట్స్​ విత్​ ట్రూత్​’లో రాసుకున్నారు. కేవలం వలంటీర్ల సాయంతో ‘నేటాల్​ ఇండియన్​ కాంగ్రెస్​’కి వేలాదిమంది కార్యకర్తలను పోగు చేశారు. బ్రిటిషర్లను లొంగదీసుకోవడానికి సత్యాగ్రహం, అహింస మార్గాలే మంచివని గ్రహించారు.

గాంధీజీ దక్షిణాఫ్రికాలో లాయర్​గా ప్రాక్టీస్​ చేశారనేది అందరికీ తెలుసు. అయితే, అప్పట్లో ఆయన వ్యవహారశైలి ఎట్లా ఉండేదో తెలుసుకుంటేమాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది.  బిడియంతో గాంధీజీ మొదట్లో ఎవరితోనూ కలిసేవారు కాదు. ఆయన వెళ్లిన ప్రతి చోట అవమానాలే ఎదురయ్యేవి. దాంతో నలుగురిలో కలవాలంటే జంకేవారు.  దక్షిణాఫ్రికాకు ఓడలో ప్రయాణిస్తున్నా కూడా పగలంతా తన గదిలోనే కూర్చుని, రాత్రివేళ పెద్దగా జనం లేనప్పుడు డెక్​ మీదకు వెళ్లేవారు. అలాంటి వ్యక్తి దక్షిణాఫ్రికాలో ఒక ప్రజా నాయకుడిగా మారిపోయారు. ఇండియా నుంచి వెళ్లిన వలస కూలీలకు పెద్ద దిక్కు అయ్యారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఇండియాకి వచ్చి ఇక్కడి పరిస్థితులపై చర్చించడం తప్పితే… బ్రిటిషర్లపై అప్పట్లో పోరాడింది లేదు. కానీ, తన అంతిమ లక్ష్యం ఇండియాకి స్వతంత్రాన్ని సాధించిపెట్టడమే అని తెలుసుకున్నాక 1915లో స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన దేశాన్ని బ్రిటిషర్లు విడిచి వెళ్లేవరకు సత్యాగ్రహం, అహింసా మార్గాల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.  గాంధీజీ ఇండియాలో ప్రాక్టీసు ఆరంభించిన కొత్తలో ఇక్కడి కోర్టుల్లో బ్రోకరేజీ జరిగేది. అంటే, కేసులు తీసుకురావడంకోసం లాబీ జరపాల్సి వచ్చేది. అది ఆయనకు నచ్చేది కాదు. బొంబాయి హైకోర్టులోనూ, రాజ్​కోట్​ కోర్టులోనూ ఆయన అర్జీలు రాయడానికి తప్ప తన బారిష్టర్​ చదువు ఎందుకూ ఉపయోగపడలేదని ఆత్మకథలో రాసుకున్నారు. ఆ సమయంలో గాంధీజీ సొంతూరు పోరుబందర్​లోని మేమన్​ దుకాణంవాళ్లు తమకు దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక దావాలో సాయపడాలని కోరితే, 1893 ఏప్రిల్​లో ఓడ ఎక్కారు.

దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన రెండో రోజో, మూడో రోజో డర్బన్​ కోర్టుకి తలపాగాతో వెళ్తే జడ్జి తీసేయమంటాడు. అది ఇష్టం లేక కోర్టు నుంచి బయటకు వచ్చేయడమే కాకుండా, ఈ విషయాన్ని అక్కడి లోకల్​ న్యూస్​పేపర్లకు ఆర్టికల్​ రాయడంద్వారా ఇండియన్ల మద్దతు కూడగట్టగలిగారు. ‘అన్​ వెల్​కం విజిటర్​’గా అవమానించినా సరే, వెనకాడలేదు. ఈ తిరుగుబాటు ధోరణి ఆయనకు ఆత్మ విశ్వాసాన్నిచ్చింది.

ఆ తర్వాత అబ్దుల్లా సేఠ్​ దావాని అవుటాఫ్​ ది కోర్టు పరిష్కరించడానికి ప్రిటోరియాకి రైలులో  వెళ్లారు. డర్బన్​ నుంచి ప్రిటోరియాకి వెళ్లేవరకు… మారిట్జ్​బర్గ్, చార్లెస్​ టౌన్​, పార్ధీకోవ్​, స్టాండర్టన్​, జోహెన్నెస్​బర్గ్​, ట్రాన్స్​వాల్​, జర్మిస్టన్​ స్టేషన్లలో..  అడుగడుగునా అవమానాలు జరిగాయి. ప్రతిదానిపైనా పోరాడి తనకు న్యాయం జరిగేలా చూసుకున్నారు. ఆ యా సందర్భాల్లో లోకల్​గా ఉండే ఇండియన్​ వ్యాపారులు, జనాల బాధలను తెలుసుకోగలిగారు. దీనిపై ఆయన ఇండియన్లలో ఐకమత్యాన్ని పెంచాలనుకున్నారు. ప్రిటోరియాలో సేఠ్​ హాజీ మహమ్మద్​ ఇంట్లో ఫస్ట్​ మీటింగ్​ పెట్టి ఒక సంఘాన్ని ఆరంభించారు. దానిద్వారా హక్కుల పిటిషన్​లు పంపుకునే ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్న అవమానాలు, అనుభవాలే తదుపరి కాలంలో ఇండియాలో ఉపయోగపడ్డాయని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు.

టీ పార్టీలో ఓటు హక్కు

దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ తిరిగొచ్చేయడానికి ఫేర్​వెల్​ టీ పార్టీ జరుగుతోంది.  అక్కడ ఒక పత్రికలో పడిన చిన్న ఐటమ్​ని గాంధీజీ చదివారు. ఆ వార్తలో ‘ఇండియన్లకు ఓటు హక్కు తీసేయాలని నేటాల్​ అసెంబ్లీలో చర్చ సాగుతోంది’ అని ఉంది. దీనిపై అక్కడున్న సేఠ్​లు ఎవరికీ అవగాహన లేదు. ఓటు హక్కు విలువ ఏమిటో గాంధీజీ వివరించే సరికి అందరూ పట్టుబట్టి ప్రయాణం ఆపుజేయించారు. ఆ సందర్భంలో… ‘నాకు ఫీజు ఏమీ అక్కర్లేదు. ప్రజా సేవకు ఫీజు తీసుకోను. కేవలం టెలిగ్రామ్​లకు, ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఖర్చుల వరకు పెట్టుకోండి’ అన్నారు గాంధీజీ. ఒక అప్లికేషన్​ రాసి, రాత్రికి రాత్రి దానికి డూప్లికేట్​ కాపీలు చేతితో రాయించి రెడీ చేశారు. వాటిపై ఇండియన్లందరి సంతకాలు తీసుకోవడానికి వలంటీర్ల టీమ్​ని తయారుచేశారు. 15 రోజుల వ్యవధిలో 10,000 సంతకాలను సేకరించారు. కనిపించిన ప్రతి ఒక్క ఇండియన్​తోనూ ఆషామాషీగా సంతకాలు చేయించలేదు. ఆ అప్లికేషన్​ని చదివి వినిపించి,  దాని అవసరాన్ని తెలియజేసి, సంతకాలు సేకరించి, నేటాల్​ అసెంబ్లీలో బిల్లును అడ్డుకోగలిగారు.