వంద శాతం ‘ఉపాధి’!..పనిదినాల టార్గెట్ లో ఇప్పటికే 90 శాతం కంప్లీట్

వంద శాతం ‘ఉపాధి’!..పనిదినాల టార్గెట్ లో ఇప్పటికే 90 శాతం కంప్లీట్
  • మార్చిలో వంద శాతం పూర్త చేసేలా కసరత్తు 
  • ఈ ఏడాది ఆమోదం పొందిన పని దినాలు 12 కోట్లు 
  • ఇప్పటి వరకు చేసిన రోజులు 10.01 కోట్లు 
  • ఖర్చు చేసిన నిధులు రూ.2,317 కోట్లు 

హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి పని కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో దాదాపు  50 లక్షలకు పైగా జాబ్ కార్డులు ఉన్నాయి.

ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి 12 కోట్ల పని దినాలు టార్గెట్ కాగా.. ఇప్పటికే 10.01 కోట్ల పని దినాలు పూర్తి చేసి.. 90 శాతం మార్కు దాటారు. 12 కోట్లు పని దినాలకుగాను రూ.2,570 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ.2,317 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.253 కోట్లు మిగిలి ఉన్నాయి. 12 కోట్ల పనిదినాలకు సమకూరే మెటీరియల్ కాంపొనెంట్ రూ.1,713.5 కోట్లు కాగా.. ఇప్పటి వరకు మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.713 కోట్లు ఖర్చు చేశారు.

ఇంకా రూ.999.7 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ కింద ఖర్చు చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అధికంగా ఫీడర్ చానల్, మట్టిరోడ్లు, ఫామ్ పాండ్స్, వనమహోత్సవంలో గుంతలు తవ్వడం, నర్సరీల్లో మొక్కల పెంపకం, వ్యవసాయ బావుల తవ్వకం, పశువుల పాకలు, గొర్రెలు, కోళ్ల షెడ్లు, పొలం బాటలు, పండ్ల తోటలు, చెక్ డ్యాంలు, ఊట కుంటలు, బోర్ వెల్ రీచార్జీ, నాటిన మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులు చేయిస్తున్నారు.

జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీ ఈ పనులకు హాజరయ్యేలా ఏపీవోలు, క్షేత్ర సహాయకులు కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, వ్యవసాయ పనులు ఉన్న  సమయంలో కూలీల హాజరు శాతం తక్కువగా ఉంటుంది. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాతే కూలీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

పెరిగిన పని దినాలు..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా భూమి లేని ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. అయితే, 2023–24 సంవత్సరంలో జాబ్ కార్డు కలిగిన కుటుంబం కనీసం 20 రోజలు  పనిచేయాలని నిబంధన ఉండడంతో కూలీల పనిదినాలు పెరిగాయి. కాగా, గతేడాదితో చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సంర అక్టోబర్ నుంచి అన్ని నెలల్లో పని దినాలు ఎక్కువయ్యాయి. దీంతో గతేడాది కంటే ఎక్కువ పని దినాలు నమోదవుతాయని అంచనా. కూలీలకు అడిగినన్ని రోజులు పనికల్పించాల్సి ఉండడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా,  వేసవిలో ఉపాధి హామీ పనికి డిమాండ్ ఉంటుంది. సెలవు దినాలు కావడంతో యువత ఎక్కువగా తమ కుటుంబ జాబ్ కార్డుపై పనిచేయడానికి సిద్ధపడుతారు. దీంతో మార్చినెలలో అవలీలగా లక్ష్యం సాధిస్తామని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే మంత్రి సీతక్క ఉపాధి హామీ లక్ష్యం సాధించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరసలో నిలపాలని అధికారులకు సూచించారు. 

గడువులోగా లక్ష్యం సాధిస్తం 

ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే 90 శాతం టార్గెట్ ఫినిష్ చేశాం. మరో నెల రోజుల్లో మిగిలిన 10 శాతం లక్ష్యం పూర్తి చేస్తం. జాబ్ కార్డు కలిగిన ప్రతీ కూలీకి పనికల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. గతంతో పోలిస్తే గడిచిన కొద్దిరోజులుగా  పనిదినాల సంఖ్య భారీగా నమోదు అవుతున్నది.– సృజన, పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్