- సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు పొన్నం ఆదేశం
- ఉమ్మడి జిల్లాల్లో కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ల ఏర్పాటు
- యూనిఫాంతో పాటు రెండు జతల నైట్ డ్రెస్లు ఇవ్వాలన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు ప్రస్తుతమున్న రెండు కాలేజ్ ఆఫ్ ఎక్స్ లెన్స్(సీవోఈ)ల సంఖ్యను పదికి పెంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ లో ఇచ్చే శిక్షణను మరింత మందికి అందించేలా ఈ సీవోఈలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుతం బాటసింగారం, సరూర్ నగర్ లో రెండు ఉండగా.. ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ సెక్రటేరియెట్ లో జరిగింది. చైర్మన్ హోదాలో మంత్రి పొన్నం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు, ఫైనాన్స్, స్కూల్ ఎడ్యుకేషన్, బీసీ గురుకుల అధికారులు హాజరయ్యారు. గతంలో జరిగిన నాలుగు బోర్డు ఆఫ్ గవర్నెన్స్ మీటింగుల్లో తీసుకున్న నిర్ణయాల్లో పెండింగ్ పనులపై మంత్రి ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థులకు ఇస్తున్న రెండు స్కూల్ డ్రెస్సులు, ఒక స్పోర్ట్స్ డ్రెస్ తో పాటుగా రెండు నైట్ డ్రెస్సులు కూడా ఇవ్వాలని పాలకమండలి సమావేశంలో ఆమోదించామన్నారు. 90 ప్రాంతాల్లో ఉన్న 104 గురుకుల విద్యాసంస్థలలో ఆర్ ఓ ప్లాంట్లు, సోలార్ వాటర్ హీటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, హైజెనిక్ కిచెన్ తో పాటు స్కూల్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు.
కిచెన్ ల పై నివేదిక ఇవ్వాలని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంను ఆదేశించారు. గురుకుల విద్యా సంస్థల్లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు నవోదయ మాదిరి నేరుగా ఇంటర్ లోకి చేరేందుకు అనుమతించామన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డుతో అనుసంధానం చేసుకొని విద్యార్థులకు ఉపాధి కల్పించేలా అనేక వృత్తి విద్య కోర్సులను ప్రారంభించాలన్నారు. డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులకు సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయాలని మీటింగ్ లో నిర్ణయించారు. వచ్చే వంద రోజుల తరువాత జరిగే సమావేశంలో సర్వీస్ రూల్స్ ఆమోదించుకోవాలని సూచించారు. అద్దె భవనాలకు 50 శాతం చెల్లింపు పూర్తయిందని, రిపేర్లను వచ్చే నెల 15లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
సెట్విన్ ఉద్యోగులకు అండగా ఉంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్
దీపావళి కానుకగా సెట్విన్ ఉద్యోగుల జీతాలను పెంచుతూ జీవో ఇచ్చామని, ఉద్యోగులు పనితీరు మెరుగుపర్చుకుని సంస్థకు మంచిపేరు తేవాలని మంత్రి పొన్నంప్రభాకర్ సూచించారు. సెట్విన్ సంస్థ పురోభివృద్ధికి కృషిచేయడంతో పాటు, ఉద్యోగుల కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ లోని పురాన హవేలీ లోని సెట్విన్ ఆఫీస్ లో చైర్మన్ గిరిధర్ రెడ్డి కార్యాలయ పూజ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు.
వచ్చే నెల 17న సెట్విన్ సంస్థ హుస్నాబాద్ లో ప్రారంభం అవుతుందని తెలిపారు. హుస్నాబాద్ వెనుకబడ్డ ప్రాంతమని, అక్కడ సెట్విన్ ట్రైనింగ్ ద్వారా వందల కుటుంబాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలు, మహిళలకు ఈవీ ఆటోలు తదితర వాటిపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెట్విన్ ఎండీ వేణుగోపాల్ రావు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.