
- ఆయన స్ఫూర్తితోనే బీసీలకు రిజర్వేషన్లు: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు: జ్యోతిబా ఫూలే జీవితం ఆదర్శప్రాయమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. ఫూలే స్ఫూర్తితోనే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులు పాస్ చేశామన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబాఫూలే 198 జయంతి సందర్భంగా బీసీ కమిషన్ ఆఫీస్ లో ఆయన ఫొటోకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మెంబర్లు
సురేందర్, జయప్రకాశ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.
టీజేఎస్ పార్టీ ఆఫీసులో..
నాంపల్లి టీజేఎస్ పార్టీ కార్యాలయంలోనూ జ్యోతిబా ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..అసమానతలు లేని సమాజం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి ఫూలే అని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని గ్రహించి, తన భార్య సావిత్రిబాయి ఫూలేకు విద్యా నేర్పించారని గుర్తుచేశారు. ఆమెను మొట్టమొదటి మహిళా టీచర్‌గా నిలబెట్టి సమాజానికి మార్గం చూపారని వివరించారు.
ఫూలే బాట అనుసరణీయం:సైదులు
మసాబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో, రాజేంద్రనగర్ బాలికల గురుకుల పాఠశాలలోనూ మహాత్మ జ్యోతిబాఫూలే జయంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ గురుకుల సెక్రటరీ సైదులు మాట్లాడుతూ..ఫూలే బడుగు, బలహీన వర్గాల విద్యకు ఎంతో ప్రాధ్యానత ఇచ్చారన్నారు. ఆయన చూపిన బాట అనుసరణీయమని వెల్లడించారు. బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయదేవి మాట్లాడుతూ..ఫూలే జీవితం అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పోరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, టాడీ టాపర్స్ కార్పోరేషన్ ఎండీ ఉదయ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.