ఆధునిక యుగ వైతాళికుడు మహాత్మా ఫూలే

ఆధునిక యుగ వైతాళికుడు మహాత్మా ఫూలే

వందేండ్లకు పూర్వమే సామాజిక న్యాయంకోసం పోరాడిన గొప్ప వ్యక్తి  మహాత్మా పూలే. అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు. 21వ ఏట తన  బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి ఊరేగింపులో తనని శూద్రుడని నిందించడంతో ఈ  సమాజాన్ని సమూలంగా మార్చాలన్న పంతంతో  కులవివక్షను అంతం చేయాలని ఫూలే నిర్ణయించుకున్నాడు.  వెనుకబడిన వర్గాలైన శూద్ర, అతిశూద్ర వర్గాలకు తరగని దన్నుగా నిలిచాడు. దేశ ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, గాంధీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న విశిష్టమూర్తి  జ్యోతిరావు ఫూలే.  ఆయన 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త. వివక్ష అంతంకోసం మార్గం చూపిన ఆలోచనాపరుడు. గొప్ప సంఘ సేవకుడు. తన అద్భుత రచనలతో అలనాటి సామాజిక రుగ్మతలను దునుమాడిన మహా రచయిత. విద్య గొప్పదనాన్ని గుర్తించిన గొప్ప తత్వవేత్త ఫూలే. 

ఇప్పుడంటే బాలికలు స్కూల్స్​కు వెళ్తున్నారు. ఉన్నత విద్యకు యువతులు సైతం విదేశాలకు వెళ్తున్నారు.. కానీ, ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు.  ఫూలేకు 1840లో సావిత్రీబాయితో వివాహం జరిగింది. మహారాష్ట్రలో మత సంస్కరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి.  మరోవైపు కులవ్యవస్థ వ్యాపిస్తున్న కాలం కూడా అదే.  అటు స్త్రీ విద్య పట్ల ఉన్న దురాచారాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడానికి జ్యోతిబా ఫూలే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు.  మహాత్మా జ్యోతిబా ఫూలే 1848లో బాలికల కోసం దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. ఆయన భార్య సావిత్రీబాయి పుణేలో ప్రారంభించిన ఈ పాఠశాలలో మొదటి ఉపాధ్యాయురాలు. అప్పుడు  సమాజంలోని ఒక వర్గం దీనిని వ్యతిరేకించింది . దీంతో  జ్యోతిబా ఫూలే తన పాఠశాలను మూసివేయవలసి వచ్చింది.

మహిళలకు విద్యాహక్కు

ఫూలే తన జీవితమంతా మహిళలకు విద్యాహక్కు కల్పించడంలో, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషి చేశారు. అప్పటికాలంలో సమాజంలో నెలకొన్న  మూఢ నమ్మకాల నుంచి విముక్తి కోరుకున్నారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహోన్నతుడు మహాత్మా ఫూలే.   11 ఏప్రిల్ 1827లో  జన్మించిన  మహాత్మా  ఫూలే  28 నవంబర్ 1890న 63 ఏండ్ల వయస్సులో మరణించారు. జీవిత పర్యంతం తన జాతి జనుల 
జీవితాలను మార్చేందుకు ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. తన జీవితాంతం అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మా జ్యోతిబా పూలే  ప్రజల గుండెల్లో ఎల్లప్పుడు నిలిచి ఉంటారు.  ఏప్రిల్‌ 11న  ఆయన జన్మదినం సందర్భంగా ఫూలే   జీవిత చరిత్ర, ఆయన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 

జననం నుంచి పోరాటం దిశగా..

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827  ఏప్రిల్ 11న  ఫూలే జన్మించారు. తండ్రి గోవింద్ రావు.  జ్యోతిరావు ఫూలే  చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం పెను విషాదం. వివక్షతో  అగ్రవర్ణాలకే  చదువు పరిమితమైన నాటి రోజుల్లో ఫూలే తండ్రి  గోవిందరావు పూలే తన కొడుకును బడికి పంపించారు. అలా పూలే చదువుకు పునాది పడింది.  పూలేకు 13 ఏండ్లప్పుడు 8 ఏండ్లున్న సావిత్రిబాయి ఫూలేతో పెండ్లి జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పూలే చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.  తిరిగి 14వ ఏట చదువును ప్రారంభించారు. జ్యోతిబా ఫూలే తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్ళి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అవమానంతో తన 
జీవితం మలుపు తిరిగింది. ఆ తర్వాత సమాజంలోని కుల వివక్షపై తనదైన అభిప్రాయాలు ఏర్పరచుకొని మిగిలినవాళ్ళ కంటే తాము ఉన్నతులమన్న అగ్ర
వర్ణాల వాదనను తిప్పికొట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా శూద్రులు కలిసికట్టుగా పోరాడాలని జ్యోతిరావు ఫూలే కోరారు. 

ఫూలేకి మహాత్మా బిరుదు

సత్యాన్ని శోధించి, ఛేదించి,  అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేయాలనే ఆలోచనతో ‘సత్యశోధక్  సమాజాన్ని’ స్థాపించారు. అణగారిన వర్గాలకు, వివక్షకు గురవుతున్న బడుగులను అణచివేత నుంచి విముక్తి కల్పించడం, అణగారిన వర్గాల యువతకు పరిపాలనతోపాటు  ఉపాధి అవకాశాలు కల్పించడం మొదలైనవి దీని ప్రధాన లక్ష్యాలు. 1848వ సంవత్సరంలో పుణేలో 'అంటరాని' కులాల బాలికల కోసం జ్యోతిబాపూలే ఒక పాఠశాలను స్థాపించాడు. 1851వ సంవత్సరంలో రెండు పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1855లో  రాత్రి బడులు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారు. స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షతను జ్యోతిరావు పూలే విమర్శించాడు.1864లో  గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని  స్థాపించి స్త్రీలకు అండగా నిలిచాడు.  ఇటువంటి కేంద్రం స్థాపించడం దేశంలోనే మొదటిది.  వితంతు పునర్  వివాహాలను  ప్రోత్సహించారు. ఆయన చేసిన సామాజిక సేవకుగాను 1888లో  ముంబైలో జరిగిన సమావేశంలో  జ్యోతిరావు ఫూలేకి  మహాత్మా బిరుదు లభించింది.

ఫూలే బాటలో  కాంగ్రెస్ ప్రభుత్వం

శతాబ్దాలుగా అణచివేతకు గురైన  కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిరావు ఫూలే.  దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి మన పూలే.  ఆయన చూపిన మార్గంలో భాగంగా అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకు,  వనరుల పంపిణీ,  పాలనలో  భాగస్వామ్యం కల్పించేందుకు తెలంగాణలోని రేవంత్‌రెడ్డి  ప్రభుత్వం కులగణన చేపట్టింది. మనప్రియతమ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో  జరిగిన కులగణను ఓ చరిత్రాత్మక  ఘట్టమని చెప్పారు.  దేశంలో  కాంగ్రెస్‌ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి  వచ్చినా  తెలంగాణ తరహాలోనే  కులగణన చేపడతామనీ  చెప్పడం సామాజిక న్యాయం అందించేందుకు వేసిన ముందడుగుగా మనం భావించవచ్చు.  తొలిసారి  కులగణనను  ప్రజా భాగస్వామ్య ప్రక్రియగా మార్చి..  ఒక గదిలో 10-–15 మందితో  కూర్చుని రూపొందించకుండా  తెలంగాణలోని  దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఇలా.. ప్రజలందరి భాగస్వామ్యంతో చేసిన కచ్చితమైన కులగణనకు  ప్రజల మద్దతు పుష్కలంగా దక్కింది.  ఇప్పుడు  దేశవ్యాప్త  కులగణన అంటేనే  బీజేపీ  భయపడుతోంది.  సమాజంలోని  రుగ్మతలు  తొలగిపోవాలంటే  కులగణనతోనే సాధ్యం.  సామాజిక  సాధికారత రావాలంటే.. ఓబీసీలకు  రాజ్యాధికారంలో  తగిన వాటా దక్కాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం అత్యావశ్యకం. అంతేకాదు  రాహుల్‌ వంటి  నేత  దేశానికి అవసరం.  ఇకపై   తెలంగాణలో చేసిన  కులగణన  దేశానికి  దిక్సూచిగా  నిలుస్తుందని  చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.

బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాడుతున్నాం

 కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌజన్యంతో  తెలంగాణ శాసనసభ ఆమోదం లభించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించడం తెలిసిందే.  దీని ద్వారా విద్య, ఉద్యోగాల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుకు కూడా  శాసనసభ ఆమోదం లభించడం  
మా చిత్తశుద్ధికి నిదర్శంగా చెప్పవచ్చు. ఈ బిల్లును  పార్లమెంట్‌కు పంపి ఆమోదింపజేసేలా కేంద్రంపై  కాంగ్రెస్  ఒత్తిడి  చేస్తున్నా  తెలంగాణ బీజేపీ నేతల్లో ఉలుకు పలుకు లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్  9లో  పెట్టడంపై  సీఎం రేవంత్ నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి ప్రధానికి వినతి అందించాలన్నా.. రాష్ట్రంలోని విపక్షాలను కలుపుకుని పోవాలని ఎంత ప్రయత్నించినా ప్రతిపక్షాల తీరు బీసీలకు అన్యాయం చేసేలా ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను  కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే జంతర్ మంతర్​ వద్ద  మోదీ సర్కారు అదిరిపోయేలా ధర్నా చేశాం.  జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాం.  స్థానిక సంస్థల్లో,  విద్య ఉద్యోగాల్లో  మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని  సుప్రీంకోర్టు తీర్పులు ఉండటంతోనే  పార్లమెంట్​లో చట్టం ఆమోదానికి మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం.  కేంద్ర ప్రభుత్వంపై  రాజీలేని పోరాటం చేస్తాం.  బీసీ సాధికారతకు  మహాత్మా పూలే చూపిన బాటలో సాగుతూ ముందుకు కదులుతాం.

- పొన్నం ప్రభాకర్, 
బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి