ఆధునిక భారతదేశంలో గౌతమ బుద్ధుడి తర్వాత సాంస్కృతిక, సామాజిక సమానత్వ విప్లవానికి నాంది పలికిన తొలి దార్శనికుడు మహాత్మా పూలే. ఆనాటి చాతుర్వర్ణ వ్యవస్థలో కులాల పేరుతో శూద్రులు, అతి శూద్రులనే నామకరణం తగిలించి పశువుల కంటే హీనంగా చూసేవారు. వాటిపై పోరాట యోధుడు పూలే. మనిషి గా పుట్టినప్పుడు తనకు స్వేచ్ఛ, సామాజిక సమానత్వం ఎవరి భిక్ష కాదని.. ఈ దేశంలో ప్రతీ ఒక్కరికీ సమానంగా జీవించే, ప్రతిదీ అనుభవించే హక్కులుంటాయని చాటి చెప్పినమానవతావాది పూలే. కులాల అంతరాలు సమసిపోవాలని ఆకాంక్షించాడు. అణచి వేయబడిన వర్గాలను ఒక్కటిగా చేసేందుకు చదువు ఒక్కటే మార్గమన్నాడు. అదే వారిని విముక్తులను చేస్తుందని నమ్మి తన భార్య సావిత్రి భాయికి చదువు నేర్పించి ఈ దేశంలో 1848లోనే బహుజనులకు తొలి పాఠశాలలను నెలకొల్పి చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచారు. అందుకే సాధారణంగా ఏ తత్త్వవేత్త అయినా తనంతట తానుగా ఆవిర్భవించడు. అనేక చారిత్రక సంఘర్షణల నుంచే పుట్టుకొస్తారు.
ఆ కోవలోకి చెందిన వారే బహుజనుల పితా మన మహాత్మా జ్యోతి బాపూలే. కులంపై పోరాటం.. సమాజంలో కులం కుళ్లును ఎత్తి చూపుతూ.. దాన్ని తుదముట్టించేందుకు పూలే రచనల్లో గులాంగిరి కలికితురాయిగా నిలిచింది. విద్యను సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలని 1882లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలోని సర్ విలియం హంటర్ కమిషన్ ముందు విద్యను సార్వజనీన ప్రాథమిక హక్కుగా చేయాలని నాడే నొక్కి చెప్పారు. మనుషులను మనుషులుగా చూసినప్పుడే సమాజంలో సమానత్వం ఫరిఢ విల్లుతుందని పూలే సూత్రీకరించాడు. ఆయన మరణించిన ఏడాదికే 1891లోనే అంబేద్కర్ రూపంలో భారతావానిపై కాలు మోపాడు. పూలే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కులం కుళ్లును.. అంటరానితనాన్ని కూకటి వేళ్లతో పెకిలించి స్వతంత్ర నవ భారతావనికి అత్యున్నతమైన భారత రాజ్యాంగం అందించాడు. పూలే ఆకాంక్షను పరిపూర్ణం చేశాడు.
విద్యతోనే జ్ఙానం
తుది శ్వాస దాకా సమాజం కోసం పరితపించిన మహోన్నత సంస్కర్తలు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.. వీరి ఇరువురిని భారతదేశ ఆధునిక వైతాళికులుగా, పునరుజ్జీవనోద్యమ పితామహులుగా, సంఘసంస్కర్తలుగా, నవభారత నిర్మాతలని చెప్పుకోవచ్చు. ఆ మహనీయుల ఆశయ సాధనలో బహుజనులుగా మన పాత్ర ఏమిటి? నేటి ఆధునిక టెక్నాలజీలో యువత పూర్తిగా తీరిక లేకుండా ఉన్నది. మహనీయుల గురించి అనుకున్నంత స్థాయిలో అధ్యయనమూ జరగడం లేదు. వాళ్ల గురించి రాయడమూ లేదు. నాడు ఆధిపత్య వర్గాలు మహనీయుల కృషి, జీవిత పోరాటాలను ఆశించిన స్థాయిలో వెలుగులోకి తేలేదనేది అక్షర సత్యం. మరి నేటి తరం యువత పూర్తి స్థాయిలో తెలుసుకోని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ మానవ జాతికి వారు ఏమి చేశారో తెలుపుతూ.. వారి త్యాగాలు రచనల రూపంలో బయటి సమాజానికి చెప్పాలి. పూలే చెప్పినట్టుగా.. విద్య లేనందుకే జ్ఞానం లేకుండా పోయింది. జ్ఞానం లేకనే నైతికత, ఐక్యత లేదు. ఐక్యత లేకనే శూద్రులు- అతిశూద్రులుగా అణచివేతకు గురికావాల్సి వస్తోంది. ఇవన్ని అవిద్యతోనే అనే సత్యాన్ని పాటిస్తూ జ్ఞాన సముపార్జన చేస్తూనే ఐకమత్యంతో మెలుగుదాం. ఆయన ఆశించిన మెరుగైన సమాజ నిర్మాణంలో పునరంకితమవుదామని ప్రతిన బూనుదాం. అదే పూలేకు మనమిచ్చే నిజమైన నివాళి.
బుర్రి శేఖర్, సోషల్ఎనలిస్ట్