ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

అచ్చంపేట, వెలుగు: పేదరికాన్ని తరిమికొట్టాలనే రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, సొంతపార్టీ నేతలే కొందరు కుట్ర దారులతో చేతులు కలిపి తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఫాంహౌజ్ ఘటన తర్వాత  ఆదివారం ఆయన   మొదటిసారి నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా  కల్వకుర్తి సమీపంలోని కొట్ర గేట్  నుంచి టీఆర్​ఎస్​ కార్యకర్తలు ఆయన స్వాగతం పలికారు. అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియం  నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు  ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా అంబేద్కర్​కు పూల మాలవేసి, మాట్లాడారు.   కొందరు సోషల్ మీడియా వేదికగా రెచ్చి పోయి నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తనకు ఫోన్లు చేసి వేధిస్తే,  పోలీసులకు ఫిర్యాదు చేయటం ఎలా తప్పవుతుందన్నారు.  నియోజకవర్గంలో నిర్మించే ప్రాజెక్ట్ కాల్వలలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం  కార్పొరేట్ సంస్థలకు మద్దతు పలుకుతూ పేదల సంక్షేమాన్ని మర్చిపోయిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్​ భారత దేశాన్ని ఏలడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ నేతలు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్  పాల్గొన్నారు.   

చెల్లప్ప కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి

వనపర్తి, వెలుగు: వాల్మీకి బోయలను ఎస్టీ జాబీతాలో చేర్చాలని  చెల్లప్ప కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని టీడీపి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలో  వాల్మీకీ బోయల రిలే నిరాహర దీక్షలు ఆదివారంతో 11 వ రోజుకు చేరాయి.  ఈసందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపి, మాట్లాడారు.  సీఎం కేసీఆర్  తెలంగాణ ఉద్యమం లోను, తమ ప్రభుత్వంలో  కూడా ఈ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన తన  మాట నిలుపుకొని వెనుకబడిన వాల్మీకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో నందిమల్ల అశోక్, అచ్యుత రామారావు, వెంకటయ్య యాదవ్, నందిమల్ల.రమేష్, జమీల్, శంకర్, బాలునాయుడు, అనిల్  పాల్గొన్నారు.

విద్యార్థుల్లోని  సృజనాత్మకతను వెలికి తీయాలి : ఎమ్మెల్సీ కాటేపల్లి

వనపర్తి, వెలుగు: విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, ప్రతిభను ప్రోత్సహించాలని శాసనమండలి సభ్యులు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి సూచించారు.   పట్టణంలోని సూర్యచంద్ర ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నేటి కాలంలో పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని,   ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలన్నారు.   విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని, ఆ దిశగా  శ్రమించాలని చెప్పారు. అనంతరం  జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి  మాట్లాడారు.  విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయని, ఆరోగ్యం, గ్లోబల్ వార్మిం గ్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహ న  ఉండాలన్నారు.   జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో విజయం సాధించిన స్టూడెంట్లకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డీఈవో రవీందర్, ఏఎంఓ చంద్రశేఖర్, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు,  మురళీధర్, వెంకటేశ్వర్ రెడ్డి, వహీదా రెహ్మాన్ పాల్గొన్నారు.

గుప్తనిధుల అన్వేషణకే గువ్వల ఆ స్వామీజీని తెచ్చారు

అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు: మండలంలోని ఓ దేవాలయం వద్ద గుప్త నిధుల అన్వేషణకే ఎమ్మెల్యే బాలరాజు సింహయాజి స్వామీని తెచ్చారని, ఆ ఫామ్​హౌజ్​ వ్యవహారంలో  తన తప్పు లేదని  బాలరాజు  ఉమామహేశ్వర దేవస్థానం వద్ద తడిబట్ట స్నానం చేసి ప్రమాణం చేయాలని బీజేపీ నేత సతీశ్​ మాదిగ డిమాండ్​ చేశారు.  ఉమామహేశ్వర దేవాలయానికి వెళ్తున్న సతీశ్​ను, బీజేపీ  నేతలను పోలీసులు అచ్చంపేట మండలం రంగాపూర్  వద్ద  అడ్డుకున్నారు.  దీంతో ఇరు వర్గాల మధ్య  తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్ట్ చేసి అమ్రాబాద్ లోని  ఈగలపెంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.  స్టేషన్​ వద్ద  సతీష్  ప్రెస్ మీట్  నిర్వహించారు. ఈ సందర్భంగా   ఆయన మాట్లాడారు.    కొనుగోళ్ల ఘటనలో  కనిపించిన  సింహయాజి    ఎమ్మెల్యే బాలరాజుకు అత్యంత సన్నిహితుడని ఆరోపించారు.  అమ్రాబాద్ మండలంలోని  దేవాలయం వద్ద గుప్తనిధుల అన్వేషణ కోసం బాలరాజు ఆయ నను ఇక్కడకు తీసుకొచ్చారని  అన్నారు.  ప్రజలు ఎమ్మెల్యే చేష్టలను గమణిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బాలరాజుకు స్వంత పార్టే ఘోరీ కడుతుందని, ప్రజలు ఓడించి తరిమి కోడతారని  తెలిపారు.  

క్రమశిక్షణకు మారు పేరు ఎస్ఎఫ్ఐ : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: క్రమశిక్షణకు మారు పేరు  స్టూడెంట్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా( ఎస్​ఎఫ్​ఐ) అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆ యూనియన్​ పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా వెంకన్న  మాట్లాడారు.   తాను ఎస్ఎఫ్ఐలో ఐదేండ్ల పాటు పని చేశానని,  ఉద్యమంలో  అవాంతరాలు ఎదురైనా  విద్యార్థుల కోసం  పోరాటాలు  నిర్వహించామని గుర్తు  చేసుకున్నారు. ఆ ఎస్ఎఫ్ఐ నేర్పిన గుణపాఠాల వల్లనే ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు. భవిష్యత్ లో విద్యార్థి  ఉద్యమాలకు అండగా  ఉంటానన్నారు. ఈ కరాయక్రమంలో ఎస్ఎఫ్ఐ  విద్యార్థులు టీచర్లుగా, నాయకులుగా ఎదగాలని కాంక్షించారు.  

కవులకు కురుమూర్తి దేవస్థానం పురస్కారాలు 

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లాకు చెందిన కవులు కోట్ల వేంకటేశ్వర రెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, డాక్టర్ ఎం.ఇందిరాదేవి  కురుమూర్తి దేవస్థానం  పురస్కారాలను అందుకున్నారు. చిన్నచింతకుంట మండలం కురుమూర్తిలో దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కవులను, కళాకారులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్  స్వర్ణసుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కవుల, కళాకారుల ఖిల్లా అని పేర్కొన్నారు.  సభకు   కురుమూర్తి దేవస్థానం చైర్మన్ ఎస్. ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించగా..  ఆత్మీయ అతిథిగా  సీనియర్ సిటిజన్ ఫోరమ్ అధ్యక్షులు సురభి జగపతిరావు హాజరయ్యారు.  కార్యక్రమంలో నిర్వహకులు బెల్లం సాయిలు, సీనియర్ సిటిజన్ ఫోరమ్ జిల్లా కమిటీ సభ్యులు నస్కంటి నాగభూషణం, ఎ.రాజసింహుడు, రాంరెడ్డి, అహ్మద్, కె. లక్ష్మణ్ గౌడ్, బాలయ్య  పాల్గొన్నారు.