పాలమూరులో వలసలు నివారించాం : మంత్రి నిరంజన్‌రెడ్డి
గద్వాల, వెలుగు: పాలమూరు జిల్లాలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి వలసలు నివారించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ధరూర్ మండల పరిధిలోని ఉప్పెర్ గ్రామంలో సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నడిగడ్డ అంటేనే వలసలకు కేరాఫ్‌గా ఉండేదని టీఆర్ఎస్ ప్రభుత్వంలో రివర్స్అయిందన్నారు. ఉచిత కరెంటు, సాగునీటి వనరులు పెంచడంతో పక్క రాష్ట్రాల నుంచి నడిగడ్డకే వలసలు పెరిగాయన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారం పగటి కలేనని, మత విద్వేషాలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జడ్పీ చైర్పర్సన్సరిత, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, వెలుగు: నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ‘జడ్చర్ల జోడో యాత్ర’ చేపట్టామని టీపీసీసీ కార్యదర్శి, జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఉడిత్యాల గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ప్రజా సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. జడ్చర్ల, బాలానగర్ మండల కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం సభను సక్సెస్ చేయాలి : సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల, వెలుగు : డిసెంబర్4న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగననున్న సీఎం కేసీఆర్సభను సక్సెస్ చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సి. లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల హిల్స్‌లోని క్యాంపు ఆఫీస్‌లో జడ్చర్ల టీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాజకీయ కక్షతో ఈడీ, ఐటీ లాంటి దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. బీజేపీ పెద్దలు జై శ్రీరాం అనడమే తప్ప దేశానికి చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలని సవాల్‌విసిరారు. జడ్పీ వైస్ చైర్మన్యాదయ్య, డీసీఎంఎస్ జిల్లా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి , ప్రణీల్‌చందర్ పాల్గొన్నారు.
సీఎం సభను సక్సెస్చేయాలి
పెబ్బేరు, వెలుగు : డిసెంబర్4న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెబ్బేరు పట్టణంలోని సహార ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్కార్యకర్తల మీటింగ్‌కు ఆయన హాజరై మాట్లాడారు.
వసంతాపూర్ లో ఎమ్మెల్యే ‘గుడ్ మార్నింగ్’ వాక్
కందనూలు, వెలుగు: ‘గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూల్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బిజినేపల్లి మండలం వసంతాపూర్ లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని అన్ని వార్డులలో వాకింగ్ చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కాలనీల్లో కావాల్సిన మౌలిక వసతులు ఏమిటి? ఏయే సమస్యలు ఉన్నాయని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా మంది డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి అడిగారని త్వరలోనే అందరికీ ‘డబుల్’ ఇండ్లు అందిస్తామని చెప్పారు. గ్రామంలోని అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి , ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్
ఆమనగల్లు, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కడ్తాల్ తహసీల్దార్ఆఫీస్ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్మురళీ కృష్ణకు అందచేశారు. బీజేవైఎం రాష్ర్ట కార్యదర్శి బ్రహ్మచారి, రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు భగీరథ్ తదితరులు పాల్గొన్నారు.
కోస్గిలో..
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేశారని బీజేవైఎం లీడర్లు విమర్శించారు. మంగళవారం కోస్గి బీజేవైఎం నగర అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్ఆధ్వర్యంలో తహసీల్దార్మమతకు వినతిపత్రం అందజేశారు.
ఆయిల్‌పామ్ రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం : కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా
మదనాపురం, వెలుగు: ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చెప్పారు. మదనాపురం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రైతు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్మొక్కలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ ఈ యేడు వనపర్తి జిల్లాలో 2, 600 ఎకరాల్లో 507మంది రైతులు ఆయిల్పామ్సాగు చేస్తున్నారని, వారికి సాగుకు సంబంధించిన సబ్సిడీ అందించామని వెల్లడించారు. కేవీకే సైంటిస్ట్ రాజేందర్ రెడ్డి శాస్త్రీయ పద్ధతుల్లో ఆయిల్పామ్సాగు, హార్టికల్చర్ ఆఫీసర్ సురేశ్‌కుమార్ చీడ పీడల నివారణపై అవగాహన కల్పించారు. రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగు చేసి మంచి లాభాలు పొందాలని హార్టికల్చర్ ఆఫీసర్ సురేశ్ కుమార్ తెలిపారు.
చిన్నంబాయి ఎస్సైని సస్పెండ్ చేయాలి : టీపీసీసీ మెంబర్ అభిలాష్‌రావు
వీపనగండ్ల, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం టీపీసీసీ మెంబర్ రంగినేని అభిలాష్ రావు చిన్నంబావి పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్‌మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని తన పీఏ శివకాశిని ఎస్సై వస్త్ర నాయక్ పీఎస్‌కు తీసుకొచ్చి అకారణంగా కొట్టారని ఆరోపించారు. అన్ని పార్టీల లీడర్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారని, కానీ కాంగ్రెస్ కార్యకర్తలపైనే దాడి చేయడం అన్యాయమన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎస్సై వస్త్ర నాయక్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నేటి నుంచి మండల కేంద్రంలో రిలే దీక్షలకు దిగుతామని అభిలాష్‌రావు హెచ్చరించారు.