వదలని వాన
మహబూబ్‌నగర్, జడ్చర్ల, మక్తల్, నాగర్ కర్నూల్ టౌన్, గద్వాల, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు అలుగు పోస్తుండడంతో షాషబ్‌గుట్ట, శివశక్తినగర్, రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీలు ముంపులోనే ఉన్నాయి. అలాగే ఎర్రకుంట అలుగు పారుతుండడంతో గణేశ్ నగర్‌లోకి వరద నీరు చేరింది. కోయిల్‌కొండ మండలం ఖాజీపూర్ గ్రామ సమీపంలోని గుట్ట వద్ద మేకల మందపై పిడుగు పడి 52 మేకలు చనిపోయాయి.
గ్రామానికి చెందిన కాపర్లు రుద్ర (20), గణేశ్(13)లకు గాయాలు కాగా.. కోయిల్‌కొండ హాస్పిటల్తరలించారు. రుద్ర పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మహబూబ్‌నగర్ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన పశువుల కాపరి పాగుంటప్ప(53) పిడుగు పడి మృతి చెందాడు. జడ్చర్ల పట్టణంలోని నల్లకుంట నీళ్లు రోడ్లపైకి వస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వాంగ -తాళ్లపల్లి మధ్య పారుతున్న దుందుభి వాగులో కార్వాంగకు చెందిన రైతు రాఘవేందర్ (30) గల్లంతయ్యారు. శుక్రవారం పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఆయన వాగు దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి , అంతారం మధ్య వాగు ఉప్పొంగుతుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.
మక్తల్ పరిధిలోని సంగంబండ రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు 3,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన
పాలమూరు జిల్లా కేంద్రంలోని రామయ్యబౌలి, ఎర్రగుంట తదితర ఏరియాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ ఎస్వెంకట్రావు పర్యటించారు. రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఫుడ్ ప్యాకెట్లను అందించారు. మంత్రి మాట్లాడుతూ ఎప్పుడు లేనంత వర్షం పడటంతో పెద్ద ఎత్తున వరద వస్తోందన్నారు. పునరావాసం కోసం మూడు ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్లను వదిలి అక్కడికి రావాలని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. శుక్రవారం తాడూర్ మండలం ఆకునెల్లికుదురు గేటు వద్ద రోడ్డుపై నుంచి పారుతున్న వాగును పరిశీలించారు. ఎవరూ వాగు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆదేశించారు. బాగా నాని కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను గుర్తించి.. ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించాలని ఆదేశించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సాయం కోసం 08540- 230201కు కాల్ చేయాలని సూచించారు.
గుండాగిరికి అడ్డాగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్
బీజేపీ నేత దేవని సతీశ్ మాదిగ
అచ్చంపేట, అమ్రాబాద్, వెలుగు: అచ్చంపేట ప్రజలకు సుపరిపాలన అందించేందుకు నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్ గుండాగిరికి అడ్డాగా మారిందని బీజేపీ నేత దేవని సతీశ్ మాదిగ ఆరోపించారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అచ్చంపేట, అమ్రాబాద్‌లోని పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. సతీశ్ మాదిగతో పాటు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రేణయ్యను తెల్లవారుజామున అచ్చంపేట స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ తమ సమస్యలు తీరుస్తాడనే నమ్మకంతో ప్రజలు గువ్వలను గెలిపిస్తే.. వారిపై దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. న్యాయం కోసం వెళ్లిన గిరిజనులపై దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్ గులాంగిరి చేస్తున్నారే తప్ప, ప్రజలకు భద్రత ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్యే గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీజేపీ నేతలు శ్రీనునాయక్, చందూలాల్, శివ చంద్ర, దేవేందర్‌రెడ్డి, గోలిరాజు, నాగరాజు, శ్రీను, అనిల్, కృష్ణ, శివ, రాజేందర్, మల్లేశ్, సత్యం ఉన్నారు.
దేశాన్ని లూటీ చేస్తున్న కేంద్రం
గద్వాల, వెలుగు: కేంద్రం ప్రజల ఆస్తులను అమ్ముతూ దేశాన్ని లూటీ చేస్తోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్ జీవో బిల్డింగ్‌లో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. కార్పొరేట్ అనుకూల విధానాలు దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు. రైల్వే, ఓడరేవులు, బీఎస్ఎన్ఎల్, ఎల్‌ఐసీ ఉక్కు, బొగ్గు తదితర ప్రజల ఆస్తులన్నింటిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అసంఘటిత కార్మికుల కోసం కేంద్రం చేసిందేమీ లేదని, పైగా కొత్త చట్టాలతో కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తోందని విమర్శించారు. ఈ మీటింగ్ లో కేజీబీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీత పాల్గొన్నారు.
పెద్దవాగులో నీటి కుక్కలు!
మానవపాడు, వెలుగు: గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని పెద్దవాగులో శుక్రవారం నీటికుక్కలు దర్శనం ఇచ్చాయి. వాగులు, నదుల్లో చేపలు తింటూ బతుకుతాయని, చాలా అరుదుగా కనిపిస్తుంటాయని మత్స్యకారులు అంటున్నారు. తుంగభద్ర నది నుంచి పెద్దవాగులోకి వచ్చి ఉంటాయని చెప్పారు.
================
రూ. కోటితో అమ్మవారి అలంకరణ
మక్తల్, వెలుగు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మక్తల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి టెంపుల్‌లో అమ్మవారు శుక్రవారం భక్తులకు రూ. కోటి కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లను వాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్ట సురేశ్ కుమార్, చైర్మన్ శ్రీనివాస్ గుప్త , ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
======================
పాలకుల నిర్లక్ష్యంతోనే ముంపు
బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ
మహబూబ్‌నగర్, వెలుగు: పాలకుల నిర్లక్ష్యంతోనే మహబూబ్‌నగర్‌లోని పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ విమర్శించారు. జిల్లా కేంద్రంలో పెద్దచెరువు, ఎర్రకుంట అలుగు పోయడంతో ముంపునకు గురైన రామయ్య బౌలి, శివశక్తినగర్, బీకేరెడ్డి కాలనీల్లో శుక్రవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి పేరిట ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. పట్టణం విస్తరణలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వరద కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు.
=====================
తల్లీ.. శరణు
నెట్‌వర్క్, వెలుగు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఐదో శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు స్కందమాతాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన, హోమం తదితర పూజలు చేశారు. సీఎంవో కార్యాలయం నుంచి ప్రతినిధులు బాపురెడ్డి, రాంచందర్ జోగులాంబ అమ్మవారికి తీసుకొచ్చిన హోమద్రవ్యాలను ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మకు స్వీకరించారు. అచ్చంపేట పట్టణంలోని వాసవీ కన్యాకాపరమేశ్వరి, భక్త మార్కండేయ, భ్రమరాంభ ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా దర్శ నమిచ్చారు. కన్యకా పరమేశ్వరిని రూ. 21 ,09,999 కరెన్సీతో అలంకరించారు. అనంతరం అర్చకులు ఉత్సవమూర్తికి గుండంలో చక్ర తీర్థ స్నానం నిర్వహించారు. కోస్గి పరిధిలోని పోలేపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి లలితా త్రిపుర సుందరి దేవి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు హోమం చేశారు. మరికల్ మండల కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో మహిళలు కుంకుమార్చన నిర్వహించారు.
================
సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు వెనక్కి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలోని 36 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులు, షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకుంటామని కలెక్టర్ ఉదయ్ కుమార్ చెప్పారు. శుక్రవారం కార్యదర్శులు, టీఎన్జీవో సంఘాల నేతలు కలెక్టర్‌ను కలిసి సస్పెన్షన్, షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీపీలు కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించకపోతే తమను బాధ్యులను చేయడం సరికాదన్నారు. స్పందించిన కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు, షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కార్యదర్శులు డ్యూటీ సక్రమంగా చేయాలని, ఏమైనా ఉంటే తన దృష్టికి గాని, అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీల సంఘం నాయకులు రాజు, సురేష్ కుమార్, లింగం, అల్లాజీ, కిషోర్, మాధవి, లక్ష్మి, టీఎన్జీవో అధ్యక్షులు వెంకటేష్, షర్షోదిన్, బాలరాజు పాల్గొన్నారు.
================
రైతులు రుణాలను సకాలంలో చెల్లించాలి
పీఎసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి
పెద్దమందడి, వెలుగు: రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని పెద్దమందడి పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆఫీసర్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 1989 నుంచి 2006 మధ్యలో తీసుకున్న రుణాలపై ప్రభుత్వం 35 శాతం మాఫీ ప్రకటించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల పరిధిలో 67 మంది రైతులు రూ.1,77,71,825 బాకీ పడగా ప్రభత్తం రూ.62,20,139 మాఫీ చేసిందన్నారు. డైరెక్టర్లు రైతులకు అవగాహన కల్పించి రుణాల రికవరీకి సహకరించాలని సూచించారు. వైస్ చైర్మన్ కుమార్ యాదవ్, కార్యదర్శులు బి.జగదీశ్వర్ రెడ్డి, సుధాకర్, డైరెక్టర్లు గౌని వెంకటేశ్వర్ రెడ్డి, రామిరెడ్డి, లక్ష్మణ్ గౌడ్, రాంసింగ్, మణ్యం కొండ యాదవ్, సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.
================
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందని కలెక్టర్ ఉదయ్ కుమార్ చెప్పారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషక మాసం వేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషక ఆహార విలువలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారులు, రక్తహీనత ఉన్న గర్భిణులను గుర్తించి ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు కృషి చేయాలన్నారు. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణులు నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎస్‌బీఐ సహకారంతో 55 బెంచీలు, 220 కుర్చీలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గారు జడ్పీ సీఈవో ఉష, జిల్లా శిశు సంక్షేమ అధికారి వెంకటమ్మ, మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన పాల్గొన్నారు.
================
జడ్చర్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి
బాలానగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. రాష్ట్ర అమలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్రం నిధులు ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు ఫండ్స్ కేంద్రానివేనని, సీఎం కేసీఆర్ రాష్ట్ర నిధులుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట కోశాధికారి శాంతికుమార్, జిల్లాఅధ్యక్షుడు వీరబ్రహ్మచారి, మండల నాయకులు పాల్గొన్నారు.
===================
అగ్రి అనుబంధ యూనిట్లు మేలు
ఎస్సీ అభివృద్ధి శాఖ
ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్
గద్వాల, వెలుగు: దళిత బంధు స్కీమ్ కింద లబ్ధిదారులు అగ్రికల్చర్ అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఎస్సీ అభివద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి లబ్ధిదారులకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు కింద ఎంపికైన లబ్ధిదారులు ఫిషరీ, కోళ్లు, పాడి పరిశ్రమ పెట్టుకుంటే బెన్‌ఫిట్ ఉంటుందన్నారు. ఈ మేరకు డెయిరీ ఇన్‌చార్జి లక్ష్మారెడ్డి యూనిట్లకు సంబంధించిన వివరాలతో సక్సెస్ స్టోరీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ రమేష్ బాబు, వెటర్నరీ జిల్లా ఆఫీసర్ వెంకటేశ్వర్లు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవింద నాయక్, ఫిషరీ ఆఫీసర్ షకీలా బాను, శ్వేతా ప్రియదర్శి పాల్గొన్నారు.
=================
వివాహేతర సంబంధంతోనే కిడ్నాప్
కేసును ఛేదించిన పోలీసులు
గద్వాల, వెలుగు: రెండు రోజుల కింద కిడ్నాప్ అయిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేల్చారు. మల్దకల్ ఎస్సై శేఖర్ వివరాల ప్రకారం.. ఆయన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం కంచిరావు పల్లి తండాకు చెందిన రవి నాయక్ మల్దకల్ మండలం నేతోనిపల్లి తండాకు చెందిన యువతిని రెండేళ్ల కింద పెళ్లి చేసుకున్నాడు. అత్తాగారింటికి వచ్చే క్రమంలో పక్కింట్లో ఉండే రేణుకతో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న భర్త భార్యను మందలించడంతో పాటు మూడు నెలల కింద ఫోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి రవినాయక్ ఫోన్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న ఇతను 28న స్నేహితులు శంకర్ నాయక్, శ్రీను నాయక్‌తో కలిసి పొలం నుంచి ఇంటికి వస్తున్న రేణుకను స్విఫ్ట్ డిజైర్ కార్లో బలవంతంగా ఎక్కించుకొని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. రేణుక భర్త లక్ష్మణ్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసిన పోలీసులు.. రవి నాయక్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గురువారం హైదరాబాద్‌లోని శివరాం పల్లిలో పట్టుకున్నారు. సహకరించిన ఇద్దరు కారుతో సహా పరారీలో ఉండగా.. శుక్రవారం అరెస్టు చేసి ముగ్గురు నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు.
=================
దేవరకద్రను అభివృద్ధి చేస్తున్న ఆల
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
భూత్పూర్, వెలుగు: దేవరకద్ర నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఎమ్మెల్యే బర్త్ డే కావడంతో కార్యకర్తలు నియోజకవర్గ
వ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. భూత్ఫూర్ మున్సిపల్ కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి
శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో యశోద ఆస్పత్రికి వైద్యబృందం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే తన సతీమణి మంజులతో కలిసి కేట్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, అడ్డాకుల జడ్పీటీసీ రాజేందర్ రెడ్డి, దేవరకద్ర, మనదనపురం, కొ
త్తకోట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
=================
ఫోన్ చార్జింగ్
పెడుతుండగా కరెంట్ షాక్
గద్వాల, వెలుగు: మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టడంతో మహిళ మృతి చెందింది. ఏఎస్సై ఏఎస్ఐ శంకరయ్య వివరాల ప్రకారం.. మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన జ్యోతి(25) భర్తతో కలిసి వ్యవసాయ పొలం దగ్గర గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జ్యోతి వంట చేసి, ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టింది. దీంతో భర్త వెంటనే గద్వాల హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి మృతురాలి కుటుంబానికి రూ. 20వేలు ఆర్థిక సాయం అందజేశారు.
సందడిగా బతుకమ్మ సంబురాలు
గద్వాల, మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. శుక్రవారం గద్వాల కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి, జడ్పీ చైర్‌పర్సన్ సరిత, మహబూబ్‌నగర్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటలు పాడి పాటలు పాడారు.