
నెల్లికుదురు (ఇనుగుర్తి ), వెలుగు : గొర్రెల పంపిణీ పథకం కోసం డబ్బులు చెల్లించిన వారిలో కొందరికే గొర్రెలు పంపిణీ చేయడం ఏమిటని, ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకే గొర్లు ఇస్తారా? అని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో గొల్ల కురుమలు నిరసనకు దిగారు. ఆదివారం ఏపీలోని అనంతపురం నుంచి తెచ్చిన గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే, దరఖాస్తు చేసుకున్న 14 మందిలో ఆరుగురికే గొర్రెలు పంపిణీ చేశారని, తమకు ఎప్పుడిస్తారని గొర్రెలు మేకలకాపరుల సొసైటీ అధ్యక్షుడిని నిలదీశారు.
అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో గందరగోళం నెలకొంది. దీనిపై పశువైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఆరు యూనిట్లు పంపిణీ చేశామని, సరిపడా గొర్రెలు దొరక్కపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. ఒకటి రెండు రోజుల్లో అందరికీ గొర్రెలను అందజేస్తామన్నారు.