మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారానికి ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ జి. రవి నాయక్ సూచించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ లో సోమవారం ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి జిల్లా అధికారులతో ఈ విషయం మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై తహసీల్దార్లు
ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందన్నారు. అడిషనల్ కలెక్టర్ ఎస్.మోహన్ రావు, డీఆర్వో కేవీవీ రవికుమార్, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్ : ప్రజావాణి ధరఖాస్తులు వెంటనే పరిష్కరించి అర్జిదారులకు సాంత్వన కలిగించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచవద్దని, మండల, గ్రామస్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యోగాలు, పెన్షన్ మంజూరు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్లు కె. సీతా రామారావు, కుమార్ దీపక్, డీఆర్డీవో నర్సింగ్ రావు పాల్గొన్నారు.
వనపర్తి : ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లు, జిల్లా అధికారులకు వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్. తిరుపతి రావుతో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, తహసీల్దార్లకు పలు సూచనలు చేశారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, కాపీలను ఫిర్యాదు దారుడికి, కలెక్టరేట్‌కు పంపించాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర సమస్యలపై అప్లికేషన్లు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించి లబ్ధిదారుడికి సమాచారం ఇవ్వాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు.
నారాయణపేట : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించడంపై అధికారులు దృష్టి పెట్టాలని నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.