క్వాలిటీ లేని పనులు.. మూడు రోజులకే కూలిన డ్రైన్లు

 క్వాలిటీ లేని పనులు.. మూడు రోజులకే కూలిన డ్రైన్లు

వనపర్తి/పెబ్బేరు, వెలుగు  మున్సిపాలిటీలలో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత కరువైంది.  కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేస్తున్నా కమీషన్ల మత్తులో పాలకమండలి సభ్యులు పట్టించుకోవడం లేదు.  జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు,అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డ్రైన్లను నిర్మిస్తున్నా రు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే కాంట్రాక్టర్లు  పనులను  హడావుడిగా  పూర్తి చేస్తున్నారు.  పెబ్బేరు మున్సిపాలిటీలో  క్వాలిటీ లేకుండా నిర్మించిన డ్రైన్ మూడు రోజులకే కూలిపోయింది. పట్టణంలోని పూల పెంటమ్మ ఇంటి నుంచి వేసిన కాలువ ఒకే వర్షానికి కూలిపోయింది. కొద్ది నెలలుగా రోడ్ల విస్తరణ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ ల  ముందు 10 ఫీట్ల మేర డ్రైన్లు తవ్వడంతో దుకాణాదారులు వాటిని దాటలేక అవస్థలు పడుతున్నారు.   

తిరగబడ్డ జనం..  జేసీబీ అద్దాలు ధ్వంసం 

పెబ్బేరులో నాణ్యత లేని పనులతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి జనం విసిగి వేసారి పోయారు. శనివారం కాలువ నిర్మాణ పనులను అడ్డుకొని జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు. క్వాలిటీ లేకుండా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. దుకాణాల ముందు ఒక్కో చోట ఒక్కోలా డ్రైన్లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పలుకుబడితో కొందరు నిబంధనలకు విరుద్ధంగా  రోడ్లు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు.

సీసీ రోడ్ల నిర్మణంలోనూ  ఇష్టారాజ్యం    

మున్సిపాలిటీలలో సీసీ రోడ్లకు సంబంధించిన పనులకు  ఆన్ లైన్ టెండర్ నిర్వహించారు.  టెండర్లు దక్కించుకున్న వారి నుంచి సబ్ కాంట్రాక్టు పొందిన అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా సీసీ రోడ్లు వేస్తున్నారు. వీటిని నాసిరకంగా నిర్మిస్తున్నారు. డబ్బులు మంజూరైన మేరకే రోడ్డు నిర్మాణం చేసి మిగతాది అసంపూర్తిగా వదిలేస్తున్నారు.  కాలనీల్లో సైడ్​ డ్రైన్లు నిర్మించకుండా సీసీ రోడ్లు వేస్తుండటంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రజలు వాపోతున్నారు.

చెక్ చేసిన తర్వాతే  బిల్లు మంజూరు చేస్తాం.

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్నాం. క్వాలిటీ అధికారులతో చెక్ చేసిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తాం. అదేవిధంగా మున్సిపల్ అథారిటీ డిజైన్ ప్రకారమే 3.5 ఫీట్ల కాలువ వేస్తున్నాం. మురుగునీరు సాఫీగా వెళ్లేలా  డ్రైన్లు నిర్మిస్తున్నాం. 

- రమేశ్​ నాయుడు,  మున్సిపాలిటీ ఏఈ, పెబ్బేరు.

రాయితో కొడితే  కాలువ పగిలిపోతోంది

పెబ్బేరు మున్సిపాలిటీలో  వేసిన డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయి. రాయి తీసుకొని కొడితే సిమెంట్ కాంక్రీటు పగిలిపోయేలా వేశారు. నిర్మించిన తర్వాత 21 రోజుల వరకు క్యూరింగ్ చేయాలి. కానీ 3 రోజులు క్యూరింగ్​ చేసి వదిలిపెడుతున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల మీద ఉన్న ధ్యాస పనులు క్వాలిటీగా చేయాలన్న దానిపై లేదు. మున్సిపల్ అధికారులు, పాలక మండలి సభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.   

నరేశ్​, పెబ్బేరు

క్వాలిటీపై   అధికారులతో చర్చించాం

 క్వాలిటీ లేకుండా సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై స్పందించి పాలకవర్గం, అధికారులతో చర్చించాం.  నాణ్యతా ప్రమాణాల ప్రకారమే కాలువల నిర్మాణం చేపట్టాలని అదేశాలు జారీ చేశాం. నిబంధనల ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి.

 కరుణశ్రీ, మున్సిపల్ చైర్ పర్సన్, పెబ్బేరు