- తెగిన కేఎల్‌ఐ కెనాల్
- 50 ఎకరాల్లో నీట మునిగిన పంట
- ఖానాపూర్ వాగులో కొట్టుకుపోయిన రైతు
నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, మక్తల్, ధన్వాడ, వెలుగు :భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వానకు కల్వకుర్తి మండలం కుర్మిద్ద-, వెంకటాపూర్ మధ్యలో ఉన్న కేల్‌ఐ కాలువ తెగిపోయి 50 ఎకరాల పంట నీట మునిగింది. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి వద్ద ఉన్న కాలువకు బుంగ పడడంతో దిగువన ఉన్న బీటీ రోడ్డు కొట్టుకుపోయింది. కోడేరు మండల ఖానాపూర్‌కు చెందిన ఆదిపచ్చర్ల బంగారయ్య (40) భార్య ముందే వాగులో కొట్టుకుపోయాడు. శుక్రవారం ఉదయం పశు గ్రాసం కోసం వాగు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఖానాపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆందోళన చేశారు. నాగర్ కర్నూల్ మండలం నాగనూల్కాజ్వే ప్రవాహంలో బైక్కొట్టుకుపోగా.. నడుపుతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. దుంధుబి వాగు కాజ్‌వేలపై నుంచి పారుతుండడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఆర్టీసీ ఈ రూట్లలో బస్సులను రద్దు చేసింది. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లిలో గురువారం రాత్రి బడుగు లక్ష్మినర్సమ్మకు చెందిన మట్టి మిద్దె కూలిపోయింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు పక్కగదిలో నిద్రిస్తుండటంతో ప్రమాదం తప్పింది.
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
సంగంబండ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండడంతో 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మాగనూర్ పెద్దవాగు నేరడగం, అడవిసత్యరం, ఉజ్జెల్లి, వర్కూర్, బైరంపల్లి, నేరడగందొడ్డి గ్రామాల్లోని లోలెవెల్ బ్రిడ్జిపై పారుతుండడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సరళాసాగర్ వాగు మూడు రోజులుగా పొంగిపొర్లుతుండడంతో మదనాపురం-–ఆత్మకూర్ మండలాల మధ్య సంబధాలు కట్ అయ్యాయి. అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రాజెక్టును పరిశీలించి దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెండురోజుల కింద పెద్దమందడి మండలం దొడగుంట పల్లి చెరువుకు గండి పడడంతో నీళ్లన్నీ కిందకు వెళ్లి దాదాపు 60 ఎకరాల్లో పంట
దెబ్బతింది.
ముంపు ప్రాంతాల్లో మాజీ ఎంపీ పర్యటన
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెద్దచెరువు, ఎర్రకుంట అలుగు పారుతుండడంతో తోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి కుర్నిశెట్టికాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్, ట్యాంక్ బండ్ ఏరియాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ముంపు సమస్యల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఉన్నారు.
పారదర్శకంగా పోడు రైతులను గుర్తించాలి
కలెక్టర్ ఉదయ్ కుమార్
అచ్చంపేట, వెలుగు: పారదర్శకంగా పోడు రైతులను గుర్తించాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఫారెస్ట్ సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అచ్చంపేట పట్టణంలోని ఫారెస్ట్ చౌసింగ్ హాల్‌లో పోడు భూముల సర్వేపై పంచాయతీ సెక్రటరీలు, అటవీ శాఖ సిబ్బందికి ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ పోడు భూముల సర్వే పక్కాగా నిర్వహించి, మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. బీట్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు కమిటీగా ఏర్పడి క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే చేయాలని చెప్పారు. సర్వేను రేపటి నుంచే ప్రారంభించి ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ రెడ్డి, ఎఫ్‌డీవో నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బడి పనుల్లో జాప్యం ఎందుకు?
కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: మన ఊరు–మనబడి కింద ఎంపికైన స్కూళ్లలో పనులు ఎందుకు కంప్లీట్ కావడం లేదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో బడి పనులతో పాటు బస్తీ దవాఖానాలపై పీఆర్, విద్య, వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కూళ్ల పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, టాయిలెట్స్, ఫ్లోరింగ్, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్ పనులను ఈనెల చివరి నాటికి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాల పనులను స్పీడప్ చేయాలని, ఇంకా ప్రారంభం పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. ఈ మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష, పీఆర్ ఈఈ సమత, డీఎంహెచ్‌వో చందు నాయక్, డీఈవో సిరాజుద్దీన్, హాస్పిటల్ సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి, డీఈ రవీందర్ పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగా కొనుగోలు చేసిన మున్సిపల్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం మత్స్యకార భవన్, ఎస్సీ, బీసీ డిగ్రీ కాలేజీ, వ్యవసాయ కాలేజీ భవనాల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ వృత్తి కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని చెప్పారు. ఉచిత చేప పిల్లలతో మత్స్యకార కుటుంబాలు , సబ్సిడీ గొర్రెలతో గొల్ల కుర్మలు అభివృద్ధి చెందుతున్నారని వివరించారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
బాధితులకు పునరావాసం కల్పించాలి
అమ్రాబాద్, వెలుగు: వర్షాలకు దెబ్బతిన్న, కూలిన ఇండ్ల బాధితులకు పునరావాసం కల్పించాలని బీఎస్పీ అసెంబ్లీ ఇన్‌చార్జి కొయ్యల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అమ్రాబాద్ మండల కేంద్రంలో ఇండ్లు కూలిపోయిన ఆలేటి ఎల్లమ్మ , రాములమ్మ, మౌనికకు శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారుకు.. కూలిన ఇండ్లు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చొరవ తీసుకొని బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అమ్రాబాద్, పదర మండల అధ్యక్షులు సురేశ్, కృష్ణ , నేతలు నరేశ్, అనిల్, రామన్న, ఆంజనేయులు, అశోక్ పాల్గొన్నారు.
14న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన
నారాయణపేట, వెలుగు:నారాయణపేట జిల్లాలో నూతనంగా నిర్మించనున్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు ఈ నెల 14న ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారని కలెక్టర్ హరిచందన తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించే స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవనాల కోసం 53 ఎకరాలు కేటాయించామని, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో రామచందర్ నాయక్, ఆర్‌అండ్‌బీ ఎస్‌సీ నర్సింగం, డీఈ రాములు, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ దానయ్య పాల్గొన్నారు.
రైతులకు పరిహారం చెల్లించాలి
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి
పెద్దమందడి, వెలుగు: భారీ వర్షాలకు మండలంలోని దొడగుంట పల్లి ఊర చెరువు కట్ట తెగిపోవడంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని, వారికి పరిహారం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు కింద సాగు చేసిన 150 ఎకరాల వరి పంట నష్టపోయిందని వాపోయారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే బలహీన పడ్డ చెరువు కట్టలను గుర్తించి రిపేర్లు చేసి ఉంటే ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆయన వెంట ఎంపీటీసీ భార్గవి, మాజీ సర్పంచ్ గట్టు మన్నెం, నేతలు త్రినాథ్, రాజశేఖర్, కురుమూర్తి, నరసింహారెడ్డి, రమేశ్ నాయక్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
మహిళా హక్కుల రక్షణ కోసం పోరాడుదాం
పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ
నారాయణపేట, వెలుగు: మహిళల హక్కుల రక్షణ కోసం పోరాడుదామని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కె.రమ పిలుపునిచ్చారు. నారాయణపేటలో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం భగత్సింగ్భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీలపై వివక్ష ఇంకా కొనసాగుతుండడంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. దేశంలో బీజేపీ పాలన వచ్చినంక స్త్రీలపై అత్యాచారాలు ప్రమాదకర స్థాయిలో పెరిగాయన్నారు. ‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదంగానే మిగిలిపోయిందన్నారు. ఈ సమావేశంలో పీవో డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ, సహాయ కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సౌజన్య, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రోడ్లు, డ్రైన్ల రిపేర్లకు రూ.100 కోట్లు
మహబూబ్నగర్, వెలుగు : భారీ వర్షాలకు మహబూబ్నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు సహా పలు చోట్ల రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జరిగిన నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. నష్టం అంచనా నివేదికను సీఎంకు అందజేశారు. స్పందించిన సీఎం రూ.100 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవో నెంబర్ 689 జారీ చేసింది.
ఎన్‌హెచ్ ఆఫీసర్స్‌పై ఈఎన్‌సీకి ఫిర్యాదు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో అందుబాటులో ఉండాలని చెప్పినా పట్టించుకోని ఎన్‌హెచ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్ రావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని రామయ్య బౌలి, బీకే రెడ్డి కాలనీ, శివశక్తి నగర్‌లో పర్యటించారు. వర్షపు నీరు బయటికెళ్లేలా నాళాలు, మురికి కాలువలు శుభ్రం చేయాలని, చెత్తా చెదారం అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రహదారుల విస్తరణ సమయంలో ఎన్‌హెచ్ సంస్థ అబ్దుల్ ఖాదర్ దర్గా, మేనక థియేటర్ వద్ద, థియేటర్ కింది భాగంలో మూడు కల్వర్టులను మూసివేసిందని , వాటిని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. దీనివల్ల గణేశ్ నగర్, వల్లభ్ నగర్, గోల్ మజీద్, పాత పాలమూరు నుంచి వర్షపు నీరు నేరుగా ఎర్రకుంట, ఇమామ్ సాబ్ కుంటకు వెళ్తుందన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్,మున్సిపల్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు.