- బీఆర్‌ఎస్ పెడితే వీఆర్‌ఎస్సే గతి
- మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ పెడితే రాష్ట్రంలో వీఆర్‌ఎస్ తీసుకోవడం ఖాయమని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం నాగర్ కర్నూల్‌లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు రైతుబీమా, పంట నష్టపరిహారం ఇవ్వని సీఎం... పంజాబ్, హర్యానా, బిహార్ రాష్ట్రాలలో చెక్కులు ఇవ్వడం ఏంటని విమర్శించారు. బీఆర్‌ఎస్ పెట్టి, రూ.80 కోట్లతో విమానం కొంటానంటున్నారని, పార్టీ కోసం ప్రజాసొమ్ము ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోని ప్రాజెక్టులే రైతులు అక్కెరకు వస్తున్నాయని, లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం వృథాగానే మిగిలిపోయిందని మండిపడ్డారు. వర్షం కారణంగా వేల ఎకరాలు పాడైపోయినా సీఎం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. శ్రీశైలం ఎలక్ట్రికల్ పనులు, నాగార్జునసాగర్ రిపేర్లు అలాగే ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నాడని, ముందే మునుగోడు బైఎలక్షన్ పెడుతున్నారని, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి డ్రామా అడుతున్నాయని విమర్శించారు. తాను మెడికల్ కాలేజీకి వ్యతిరేకం కాదని, స్థలం ఇచ్చిన దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దళితుల పక్షాన ఉంటాడా? బ్రోకర్లప్రక్షాన ఉండాడో..? తేల్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, టి .పాండు, లక్ష్మయ్య, నారాయణ గౌడ్ పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డుకు రూ.73 కోట్లు మంజూరు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, కల్వకుర్తి, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వనపర్తి బైపాస్ రోడ్డుకు రూ.73 కోట్లు మంజూరు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో 153 మందికి రూ.41.55 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మణిగిల్లకు చెందిన పార్టీ కార్యకర్త ముప్పరి గట్టయ్య మంజూరైన రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఆయన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాన్ గల్ రోడ్డు, శ్రీనివాస్ పూర్, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ మీదుగా కొల్లాపూర్, పెబ్బేరు, కొత్తకోట ప్రాంతాలకు వెళ్లేందుకు 9 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వనపర్తిలో మత్స్యకార భవన్ కు 35 గుంటల స్థలం, పెబ్బేరులో వృద్ధాశ్రమానికి రూ.50 లక్షల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లిలో 6 గ్రామాలకు చెందిన 306 మంది దళితబంధు లబ్ధిదారులకు ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలిసి తొమ్మిది రకాల యూనిట్లను పంపిణీ చేశారు.
పీఆర్‌ఎల్‌ఐ పనులు స్పీడప్ చేయాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ , వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు స్పీడప్ చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. సోమవారం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరింగ్ రమణారెడ్డి, ఈఈ దయానంద్‌తో కలిసి మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ సమీపంలోని పీఎల్‌ఆర్ఐ కాల్వల నిర్మించనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే ఆలస్యం అయ్యాయని, ఆటంకాలు తొలగించి స్పీడప్ చేయాలన్నారు. కర్వెన నుంచి నారాయణపేట వరకు వెళ్లా కాల్వ దారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. అనంతరం మహబూబ్ నగర్ మండలం కోడూరు చెరువులో 42 వేల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ ఆఫీసర్ డి.రాధ రోహిణి, జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి పాల్గొన్నారు.
మహాగౌరి దేవిగా జోగులాంబ
ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం మహాగౌరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి సహస్రనామార్చన, నావావరణ అర్చన, చండీహోమం, దర్బారు సేవ, బొమ్మల కొలుపు నిర్వహించారు.
ఆయుధ పూజ చేసిన పోలీసులు
గద్వాల, నారాయణపేట, వనపర్తి టౌన్, వెలుగు:ఎప్పుడూ శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే పోలీసులు దసరాకు రెండు రోజుల ముందుగానే తమ ఆయుధాలకు పూజలు చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ మనోహర్, గద్వాలలో ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎస్పీ యాదగిరి, నారాయణపేటలో ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, వనపర్తిలో డీఎస్పీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో గన్స్, వాహనాలకు పూజలు చేశారు.
ఇద్దరు దొంగల అరెస్ట్
వనపర్తి, వెలుగు: ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసాచారి మీడియాకు వివరాలు వెల్లడించారు. పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లిన వనపర్తి మండలం పెద్దగూడెంకు చెందిన చీర్ల ఈశ్వరయ్య ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యాడు. ఆ తర్వాత అతని భార్య రాధతో పాటు ఆమె అక్క కొడుకు వేణు అలియాస్ అఖిల్‌తో కలిసి టీంగా ఏర్పడి.. ఉమ్మడి జిల్లాతో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను దోచుకోవడం ప్రారంభించారు. 15 రోజుల కింద పెద్దమందడి మండలంలో ఓ వృద్ధురాలిని దృష్టి మళ్లించి 2 తులాల బంగారు నగలను దోచుకున్నారు. ఈమె కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ అపూర్వరావు సీసీఎస్ పోలీసులతో టీమ్‌ను ఏర్పాటు చేయగా.. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టి సోమవారం వనపర్తి మండలం పెద్దగూడెంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. పెద్దమందడి, శ్రీరంగాపూర్, మరికల్, పెంట్లవెల్లి, కోడేరు, మూసాపేట్, బొంరాస్ పేట్, పహాడీ షరీఫ్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. వారి నుండి పది తులాల బంగారం, 45 తులాల వెండి, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఈశ్వరయ్య భార్య పరారీలో ఉంది.