వడ్లు దింపుకుంటలేరు .. సరిపడా లారీలు లేక సెంటర్ల వద్దే నిల్వలు

వడ్లు దింపుకుంటలేరు .. సరిపడా లారీలు లేక సెంటర్ల వద్దే నిల్వలు
  • రైతులు అద్దె ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్నా పట్టించుకోని మిల్లర్లు
  • ప్రతి రోజూ వెంటాడుతున్న అకాల వర్షాలు

మహబూబ్​నగర్/చిన్నచింతకుంట, వెలుగు: మిల్లర్లు, వడ్ల కొనుగోలు సెంటర్ల నిర్వాహకుల తీరుతో రైతులు అరిగోస పడుతున్నారు. రెండు వారాలుగా వడ్లను ఆరబెట్టుకొని సెంటర్లకు తీసుకువచ్చిన వడ్లను కాంటా వేసినా మిల్లులకు తరలించేందుకు లారీలు అందుబాటులో ఉండడం లేదు. చేసేది లేక రైతులే ట్రాక్టర్లను అద్దెకు తీసుకొని మిల్లులకు వడ్లు తరలిస్తే.. అక్కడా సంచులు దింపుకుంటలేరు. దీనికితోడు అకాల వర్షాలు వెంటాడుతుండడంతో వడ్ల బస్తాలు తడుస్తాయని ఆందోళన చెందుతున్నారు.

అందుబాటులో 84 లారీలే..

మహబూబ్​నగర్​ జిల్లాలో ఐదు ఏజెన్సీలు వడ్ల సెంటర్ల నుంచి బస్తాలను మిల్లులకు తరలించేందుకు కాంట్రాక్ట్  దక్కించుకున్నాయి. ఒక్కో ఏజెన్సీ 25 లారీలను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ప్రతి సెంటర్​ నుంచి దాదాపు రెండు వేల బస్తాల వరకు కాంటా జరుగుతున్నాయి. ఫ్లో పెరగడంతో ఎప్పటికప్పుడు కాంటా చేసిన వడ్ల బస్తాలను మిల్లులకు తరలించాల్సి ఉంది. అయితే ఏజెన్సీలు సరిపడా లారీలను అందుబాటులో ఉంచడం లేదు. 

ఈ ఐదు ఏజెన్సీలు 125 లారీలను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, 84 లారీలను మాత్రమే అందుబాటులో ఉంచాయి. దీంతో సెంటర్ల వద్ద వడ్ల సంచులు పేరుకుపోతున్నాయి. అకాల వర్షాలు భయం వెంటాడుతుండడంతో రైతులు అద్దె ట్రాక్టర్లలో వడ్ల బస్తాలను మిల్లుల వద్దకు తీసుకుపోతున్నారు. కానీ, మిల్లర్లు బస్తాలను దింపుకోవడం లేదు. ట్రాక్టర్లలో వచ్చిన వడ్లను దింపుకోవాలని పర్మిషన్​ లేదని చెబుతున్నారు. దీంతో రైతులు వడ్ల లోడ్​తో రెండు రోజులుగా మిల్లుల వద్దే ఉంటున్నారు.

మిల్లుల్లో హమాలీల సమస్య..

ఎండాకాలం కావడంతో హమాలీలు మిల్లులకు ఎక్కువగా రావడం లేదు. దీంతో మిల్లుల వద్ద వడ్లు దింపడంలో ఆలస్యం అవుతోంది. అలాగే ఎండలు ముదరడంతో అందుబాటులో ఉన్న కొందరు హమాలీలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పని చేస్తున్నారు. ఆ తర్వాత ఇండ్లకు పోయి సాయంత్రం వస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల వరకు లారీలను అన్​లోడ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో పది టైర్లు, 12 టైర్ల లారీలు రోజుకు 8 కంటే ఎక్కువ అన్​లోడ్​ కావడం లేదు. ఈ కారణంగా కూడా వడ్ల బస్తాలు సెంటర్ల వద్ద ఉండిపోతున్నాయి. 

గన్నీ బ్యాగులూ ఇవ్వడం లేదు..

సెంటర్లకు రైతులు పెద్ద మొత్తంలో వడ్లు తీసుకొస్తున్నారు. ఎక్కడికక్కడ వడ్లను కుప్పగా పోసి కవర్లు కప్పుకుంటున్నారు. అయితే అకాల వర్షాలు పడుతుండడంతో వడ్లల్లో తేమ శాతం పెరుగుతోంది. దీంతో రైతులు  ఒకటికి రెండు సార్లు వడ్లను ఆరబెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. అయితే వీరికి గన్నీ బ్యాగులు ఇవ్వాల్సి ఉన్నా.. నిర్వాహకులు ఇవ్వడం లేదని అంటున్నారు. వడ్లను సంచుల్లో నింపి, జోకడానికి హమాలీలు సరిపడా అందుబాటులో లేకపోవడంతో, ఆ పనులను రైతులే 
చేసుకుంటున్నారు.

భూములు వెనక్కివ్వాలి 

టీజీఐఐసీకి సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుంటే వాటిని తిరిగి రైతులకు ఇవ్వాలి. నాలుగేండ్ల కింద ఇచ్చిన భూమికి పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. పరిహారం ఇవ్వకుంటే మా పట్టాలు మాకు తిరిగి ఇవ్వాలి. పరిహారం కోసం అధికారుల వద్దకు వెళ్తే స్పందించడం లేదు. 

తప్పెట మల్లేశం, రైతు, దాచారం

ముందుగా గన్నీ బ్యాగులు ఇవ్వడంతోనే సమస్య..

జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు 14 లక్షల గన్నీ బ్యాగులు అందజేశాం. కొన్ని సెంటర్ల నిర్వాహకులు రైతులకు ముందస్తుగా గన్నీ బ్యాగులు ఇచ్చారు. వారు వడ్లను సంచుల్లో నింపుకున్నా, మాయిశ్చర్​ రావడం లేదు. కొందరు రైతులు తూర్పార పట్టలేదు. దీంతో ట్రాన్స్​పోర్ట్​ సమస్య వస్తోంది. 

రవి నాయక్, సివిల్​ సప్లై డీఎం

వడ్లు తడిస్తే నష్టమే..

లారీలు, డీసీఎంలోనే రైస్  మిల్లులకు వడ్లు తరలించాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో తిప్పలు పడుతున్నాం. అకాల వర్షాలకు వడ్లు తడిస్తే ఇబ్బంది అవుతోంది. రైస్  మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా వడ్లు తరలించేందుకు అవకాశం ఇవ్వాలి. 
- గొల్లనంబి తిరుపతి, కురుమూర్తి, చిన్నచింతకుంట మండలం