చెడు సావాసాలకు దూరంగా ఉండాలి : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

చెడు సావాసాలకు దూరంగా ఉండాలి : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: చెడు సావాసాలకు దూరంగా ఉండాలని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్​ తరువాత నాలుగేండ్ల సమయం విలువైందని తెలిపారు. భవిష్యత్తు బాగుండాలని, తమ తల్లిదండ్రుల మాదిరిగా కష్టపడవద్దనే ఉద్దేశంతో ముందుకెళ్లాలని సూచించారు.

తల్లిదండ్రులతో పాటు తాము కూడా విద్యార్థుల భవిష్యత్​ బాగుండాలని తపన పడుతున్నామని తెలిపారు. ఇంటర్​ ఎగ్జామ్స్​ ముగిసిన తరువాత నెల రోజుల పాటు ఇంజనీరింగ్, నీట్  పరీక్షలకు క్రాష్  కోర్స్  ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని తెలిపారు. లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రామకృష్ణ గౌడ్, కాలేజీ ప్రిన్సిపాల్  భగవంతచారి, డీసీసీ జనరల్​ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.

విద్యానిధికి పోలీసుల విరాళం

మహబూబ్ నగర్ కలెక్టరేట్: పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన విద్యానిధికి రూ.10 కోట్లు సమకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసులు జమ చేసిన రూ.3 లక్షల చెక్కును శుక్రవారం ఎస్పీ జానకి ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్  విజయేందిర బోయికి అందచేశారు.

విద్యానిధికి రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందని, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, టీచర్లు, సామాన్య ప్రజలు తమకు తోచినంత సాయం చేస్తున్నారని కొనియాడారు. వచ్చే నాలుగేండ్లలో రూ.10 కోట్లు సేకరించి ప్రతి పైసా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వినియోగిస్తామని తెలిపారు.