
పాలమూరు, వెలుగు: ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. రెండు కోట్లతో మినీ ట్యాంక్ బండ్ లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఏ ఒక్క లబ్దిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు. రేషన్ కార్డు లేకపోవడం తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారన్నారు.
అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసీ రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, అవేజ్, తహసీల్దార్ సుందర్ రాజ్, ఎంపిడిఓ కరుణశ్రీ, పాల్గొన్నారు.