- డోనర్స్ సహకారంతో ఫండ్స్ సేకరణ
- కలెక్టర్ ఆధ్వర్యంలో స్కీమ్ నిర్వహణ
- నేటి నుంచి అమలు
మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరు జిల్లాలో విద్యాభివృద్ధికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ‘మహబూబ్‌నగర్ విద్యా నిధి’ స్కీమును కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనున్నారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహణ
'మహబూబ్‌నగర్ విద్యా నిధి' స్కీము కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఎస్బీఐ అకౌంట్ ను తెరిచారు. దాదాపు 50 ఏండ్ల పాటు ఈ స్కీము కొనసాగేలా చూస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో) స్కీమును నిర్వహిస్తారు.
చదువుకు సాయం..
ఫస్ట్ నుంచి టెన్త్ వరకు, ఇంటర్, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదువుకునే వారికి అవసరం మేరకు ఆర్థిక సహాయం చేస్తారు. స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటిస్‌లో పాల్గొనే పేద విద్యార్థులకు కూడా ఆర్థిక చేయూతను అందిస్తారు.
అందరి భాగస్వామ్యంతో
స్కీముకు మున్సిపాల్టీ పరిధిలోని ప్రముఖులు, బిజినెస్మెన్లు, ఉన్నత చదువులు చదువుకున్న వారి నుంచి డొనేషన్లు స్వీకరించనున్నారు. ఎవరెవరికి ఆర్థిక సహాయం చేయాలనే దానిపై ఓ కమిటీని వేయనున్నారు. ఈ కమిటీలు ఉన్నత చదువుల కోసం, ఇతర రంగాల్లో రాణించడానికి ఆర్థిక సాయం కోసం వచ్చే అప్లికేషన్లను పరిశీలిస్తాయి. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం అందిస్తాయి. ఎమ్మెల్యే యెన్నం తన జీతం నుంచి ప్రతి నెలా రూ.లక్ష ఈ నిధిలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఐదేండ్ల పాటు రూ.50 లక్షల వరకు తన జీతం నుంచి నిధికి ఇవ్వనున్నట్లు చెప్పారు.
రెండు వార్డులకు ఒక లెర్నింగ్ సెంటర్
మహబూబ్‌నగర్ టౌన్లో ఎడ్యుకేషన్‌ను డెవలప్ చేసేందుకు లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు వార్డులకు కలిసి ఒక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సెంటర్లు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు నడుపనున్నారు. డిగ్రీ, బీఈడీ, టీటీసీ, ఇతర పై చదువులు చదువుకొని పిల్లలకు ట్యూషన్లు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి అప్లికేషన్లు తీసుకోనున్నారు.
ఎడ్యుకేషన్‌లో నంబర్ వన్ కావాలి
సరస్వతి నిలయమైన పాలమూరులో పదేండ్లుగా విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయి. పేరుకు మాత్రమే కాస్త అక్షరాస్యత పెరిగింది. కానీ చదువుల్లో ఎలాంటి డెవలప్మెంట్ సాధించలేదు. రంగారెడ్డి జిల్లాతో పోల్చితే ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో పాలమూరు చాలా వెనుకబడి ఉంది. ఎడ్యుకేషన్‌లో పాలమూరు జిల్లాను స్టేట్‌లోనే నంబర్ వన్‌గా నిలుపాలనే టార్గెట్‌తో పని చేస్తున్నాం. అందుకే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్పై ఫుల్ ఫోకస్ పెట్టాం.
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్