షాద్‌నగర్, వెలుగు : అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పలు వినాయక మండపాలను సోమవారం సందర్శించి గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం నడుస్తుందని, రాష్ట్రంలో పాలన మొత్తం కుంటుపడిందన్నారు.
ముస్లిం వర్గాల మెప్పు కోసం విమోచన దినోత్సవానికి ప్రజాపాలన దినోత్సవం అని పేరు పెట్టారని విమర్శించారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్లు ఒకరిని మించి ఒకరు పనిచేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదని, యూట్యూబ్ ఛానళ్లే ఆయనకు ప్రచారం చేశాయని ఎద్దేవా చేశారు. యేరు దాటిన తర్వాత ఇప్పుడు వాటితే పనిలేదని అంటున్నారన్నారు. ఆమె వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణు వర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, వెంకటేశ్ గుప్తా ఉన్నారు.