రుణమాఫీపై వైట్​పేపర్​ రిలీజ్​ చేయాలి

రుణమాఫీపై వైట్​పేపర్​ రిలీజ్​ చేయాలి
  •     సింపతీ కోసమే కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం
  •     మహబూబ్​నగర్ ఎంపీ డీకే అరుణ

కొడంగల్, వెలుగు : రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం వైట్​పేపర్​ రిలీజ్​ చేయాలని మహబూబ్​నగర్ ​ఎంపీ డీకే అరుణ డిమాండ్​ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, లబ్ధి పొందిన రైతుల వివరాలను విడుదల చేయాలన్నారు. మంగళవారం కొడంగల్​లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన టైంలో పోలవరం మాదిరిగా పాలమూరు– రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

పీఆర్ఎల్ఐకి శ్రీశైలం బ్యాక్​వాటర్ ​కాకుండా జూరాల నుంచి నీటిని మళ్లిస్తే కొడంగల్, నారాయణపేట, మక్తల్, జడ్చర్ల, మహబూబ్​నగర్, షాద్​నగర్, పరిగి నియోజకవర్గాలకు మేలు జరుగుతుందన్నారు. వికారాబాద్,​ -కృష్ణ రైల్వేలైన్​ సర్వే పనులు పూర్తయినట్లు చెప్పారు. పాజెక్టు డీపీఆర్ ​సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేస్తే వికారాబాద్,  కృష్ణ రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నారు. ఈ విషయంలో రాష్ర్టానికి సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్రం రెడీగా ఉందన్నారు.

బీఆర్ఎస్, బీజేపీలు కలుస్తున్నాయని కాంగ్రెస్​ పార్టీ కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ ​క్యాలెండర్​పై స్పష్టత లేదని, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ​అడుగుజాడల్లోనే సీఎం రేవంత్​నడుస్తున్నారన్నారు. పున్నం లాహోటి, ప్రతాప్​రెడ్డి, సదానంద్​ రెడ్డి, రాజవర్దన్​రెడ్డి, బస్వరాజ్​ ఉన్నారు.