
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. చిన్నప్పుడు తండ్రి పాన్ సింగ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారని, ఆయనంటే చాలాభయపడేవాడినని ధోనీ చెప్పాడు. తండ్రి వల్లే తనకు క్రమశిక్షణ, సమయపాలన అలవాటైందని తెలిపాడు. ‘చిన్నప్పుడు మా నాన్నంటే నాకు చాలా భయం. ఆయన చాలా క్రమశిక్షణతో ఉండేవారు. సమయాన్ని కట్టుదిట్టంగా పాటించేవారు. అదే నాకూ అలవాటయ్యింది. నాన్న నన్ను అస్సలు కొట్టేవారు కాదు.
కానీ, తను ఎదురుగా ఉంటే చాలు నాలో ఏదో తప్పు చేసినట్టు వణుకు పుట్టేది. నా ఫ్రెండ్స్ అందరూ గోడలెక్కి ఆడుకునేవాళ్లు. కానీ నేను మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. నాన్న చూస్తే నా పనైపోయినట్టే అనుకునేవాడిని’ అని మహీ చెప్పుకొచ్చాడు. రాంచీలో తన చిన్నతనం ఎంతో సింపుల్‌గానే సాగిందని, ఆ రోజుల్లో మొబైల్‌ఫోన్లు లేకపోవడం వల్ల జీవితం ఇంకా బాగుండేదని ధోనీ అన్నాడు. అప్పుడు ప్రతి రోజు ఒకేలా అనిపించేదని గుర్తు చేసుకున్నాడు.