న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ క్రీడల్లో వయసుకు ఎవరూ డిస్కౌంట్ ఇవ్వరని టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ అన్నాడు. పరిస్థితులకు, ఆటకు తగినట్లుగా మనమే ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలన్నాడు. ‘లీగ్‌కు ముందు క్రికెట్ ఆడకుండా డైరెక్ట్‌గా ఐపీఎల్ ఆడటం చాలా కష్టంతో కూడుకున్నది. దీనికి చాలా ఫిట్‌నెస్ కావాలి. ఎందుకంటే ఫిట్‌గా ఉన్న యంగ్‌స్టర్స్‌తో మనం పోటీ పడాల్సి ఉంటుంది.
అందుకే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడటం అంత ఈజీ కాదు. మనం ఆడాలంటే అవతలి కుర్రాడిలా ఫిట్‌గా ఉండాలి. కానీ వయసు అడ్డంకిగా మారుతుంది. కాబట్టి ఆహారపు అలవాట్లు, ట్రెయినింగ్, ఇతర వ్యాపకాలతో ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవాలి. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతున్నా. వ్యవసాయం, మోటార్ బైక్‌లు, వింటేజ్ కార్లు అంటే నాకు ఇష్టం. వాటితో గడుపుతూ ఒత్తిడిని తగ్గించుకుంటా’ అని ధోనీ పేర్కొన్నాడు.