మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. 27న విచారణకు పిలుపు

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. 27న విచారణకు పిలుపు

హైదరాబాద్: సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. సురానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు మహేష్ బాబు ఐదున్నర కోట్ల రూపాయలకు పైగానే తీసుకున్నట్లు తేలింది. కంపెనీ ప్రమోషన్లో భాగంగా మహేశ్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ సంస్థ రూ.5.9 కోట్లు చెల్లించింది. ఇందులో.. రూ.2.5 కోట్ల నగదు, రూ.3.4 కోట్లను చెక్కు రూపంలో మహేశ్ అందుకున్నాడు. మహేశ్ బాబుకు చెల్లించిన ఈ రెమ్యునరేషన్పై ఈడీ ఆరా తీయనుంది.

సురానా అనుబంధ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్‌‌, భాగ్యనగర్ ప్రాపర్టీస్‌‌లో జరిపిన సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ ఆఫీసర్లు గుర్తించారు. మొత్తం రూ.74.5 లక్షల నగదును ఈడీ సీజ్‌‌ చేసింది. మాదాపూర్‌‌‌‌, జూబ్లీహిల్స్, బోయిన్‌‌పల్లిలోని సురానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇండ్లతో పాటు సాయిసూర్య డెవలపర్స్‌‌ కార్యాలయాల్లో కీలక ఆధారాలు సేకరించారు.

సురానా సంస్థ వట్టినాగులపల్లిలో రియల్ ఎస్టేట్‌‌ వెంచర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును షెల్‌‌ కంపెనీలకు మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు.