ముందస్తు షూటింగ్ వల్ల విచారణకు రాలేను : మహేశ్ బాబు

ముందస్తు షూటింగ్ వల్ల  విచారణకు రాలేను : మహేశ్ బాబు
  • సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఈడీకి మహేశ్ బాబు లెటర్
  • మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సాయిసూర్య డెవలపర్స్‌‌‌‌  మనీ లాండరింగ్  కేసులో సోమవారం జరగాల్సిన ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌  డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) విచారణకు హాజరు కాలేనని నటుడు మహేశ్‌‌‌‌ బాబు తెలిపారు. ముందస్తు షూటింగ్  షెడ్యూల్  ఉన్నందున ఎంక్వయిరీకి రాలేనని ఈడీకి ఆయన ఆదివారం లేఖ రాశారు. తన లేఖను పరిగణనలోకి తీసుకుని మరో తేదీని సూచించాలని కోరారు. కాగా.. మహేశ్‌‌‌‌బాబు లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకుంది. విచారణకు అనుకూలమైన తేదీలను పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ఆయనకు సమాచారం అందించనుంది. సాయిసూర్య డెవలపర్స్‌‌‌‌, సురానా గ్రూప్‌‌‌‌  ఆఫ్‌‌‌‌  కంపెనీల మనీ లాండరింగ్‌‌‌‌ కేసులో ఈనెల 21న మహేశ్‌‌‌‌ బాబుకు ఈడీ సమన్లు జారీ చేసింది. సురానా గ్రూప్  ఆఫ్  అనుబంధ కంపెనీలు సాయిసూర్య డెవలపర్స్‌‌‌‌, భాగ్యనగర్  ప్రాపర్టీస్‌‌‌‌ సంస్థల్లో ఈనెల 16న నిర్వహించిన సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. 

సాయిసూర్య డెవలపర్స్‌‌‌‌ ను ప్రమోట్ చేసిన మహేశ్ బాబు

సాయిసూర్య డెవలపర్స్‌‌‌‌, భాగ్యనగర్‌‌‌‌‌‌‌‌  ప్రాపర్టీస్‌‌‌‌  రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసీ ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌, షణ్ముక నివాస్‌‌‌‌  పేరుతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు మహేశ్‌‌‌‌ బాబు ప్రమోటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు. ఇందుకుగాను సాయిసూర్య డెవలపర్స్‌‌‌‌  నుంచి ఆయనకు చెక్కుల రూపంలో రూ.5.9 కోట్ల చెల్లింపులు జరిగాయి. దీనికి సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే మహేశ్‌‌‌‌ బాబుకు సమన్లు జారీ చేశారు.