బీసీలంతా ఏకం కావాలి..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు

  • రవీంద్రభారతిలో వడ్డె ఓబన్న జయంతి ఉత్సవాలు 

హైదరాబాద్, వెలుగు: కులాలను పక్కనపెట్టి బీసీలంతా ఏకం కావాల్సిన టైం వచ్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం రవీంద్రభారతిలో జరిగిన వడ్డె ఓబన్న జయంతి ఉత్సవ కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న అని, బ్రిటిషర్లను వణికించిన వీరుడు ఓబెన్న అని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో  బీసీల పాత్ర కీలకమని అన్నారు.

ఐక్యంగా ఉంటే బీసీలకు ఎవరూ సాటిరారని చెప్పారు. రాష్ట్రంలో కుల గణన సర్వే 95%  పూర్తయిందని, ఈ సర్వే ఆధారంగా బీసీల రిజర్వేషన్లను డిమాండ్ చేసే అవకాశం ఏర్పడిందన్నారు. పదేండ్ల పాలనలో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఒడ్డెర కులానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

సంతాపం: సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్​లో మునిగి ఐదుగురు యువకులు చనిపోయిన ఘటనపై మహేశ్ గౌడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం విచారకరమన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.