హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ దాడులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల లోపాయికారి ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ రైడ్స్ ఈ కుట్రలో భాగమేనని అన్నారు. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 96 శాతం ప్రతిపక్షాల మీదనే దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి పొందడానికి ప్రతిపక్ష పార్టీల నేతలపై బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ | మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
బీజేపీ అక్రమ కేసులను మేం రాజ్యాంగ బద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇక, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా గురించి మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతల వల్ల నష్టపోతున్న పేదలను ఆదుకుంటామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై హరీష్ రావు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.