ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం

ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం

 

  • ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని భట్టికి 
  • రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వినతి

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకానికి రాష్ట్రంలో బీజేపీ బలపడే విధంగా కొందరు మనువాదులు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆరోపించింది. ఆ కుట్రలకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలి కాకూడదని కోరింది. 

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు పూర్తిగా ఆశాస్త్రీయంగా ఉందని, ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టమని పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌ రాజకీయాలు, మనవాదులు చేస్తున్న కుట్రలను వివరిస్తూ జేఏసీ నాయకులు బేరా బాలకిషన్ (బాలన్న), జి.చెన్నయ్య, చెరుకు రామచందర్, తాళ్లపల్లి రవి, బూర్గుల వెంకటేశ్వర్లు, గోపుజో రమేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు 33 మాల సంఘాల నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తన కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ ఏజెంట్ మందకృష్ణను ముందు పెట్టుకొని వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం జరిగేటట్లు ఆటలాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత వెనుకబడిన ఎస్సీలు ఉపకులాలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెనకబడిన మాల కులస్తులు కాటికాపరి వృత్తి చేసే బ్యాగరులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా చేయాలి కానీ.. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి మనువాదులు చేస్తున్న కుట్రలను ప్రభుత్వం, నాయకులు, ప్రజలు గ్రహించాలన్నారు. కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.