హైదరాబాద్: పార్టీలో సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ గౌడ్ ఇవాళ (శనివారం) మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మహేష్ గౌడ్.. సీఎంతో భేటీ అయ్యి తన ఎన్నికకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కొత్త బాస్‌గా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని.. ఇందుకు తన నియామకమే నిదర్శనమని ఉదహరించారు. త్వరలోనే పార్టీలో పదవుల భర్తీ ఉంటుందన్న మహేష్ గౌడ్.. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి తప్పక న్యాయం జరుగుతోందని చెప్పారు.
ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడం పీసీసీ చీఫ్గా నా ముందున్న బిగ్ టాస్క్ అని అన్నారు. పీసీపీ చీఫ్ కోసం చాలా మంది పోటీ పడ్డారని.. హైకమాండ్ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పీసీసీ సీటు కోసం పోటీ పడిన వారితో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని.. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు.