80 శాతం కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే : పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్​

80 శాతం కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే : పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్​
  • గతంలో మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి.. ఇప్పుడు  గగ్గోలా?
  • బీఆర్ఎస్​ ఎలక్షన్​ మేనిఫెస్టోలోనే మూసీ ప్రక్షాళన లేదా
  • మూసీ పరీవాహక ప్రాంతంలో ఒక్క గుడిసె కూడా కూల్చలే
  • హైడ్రా టార్గెట్ భూ బకాసురులే
  • నగర​ అభివృద్ధి అంటే ఫాంహౌస్​ల ​డెవలప్​మెంటా?
  • మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్​కు పెట్టుబడులు 
  • పేదలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన చేయాలని గతంలో కేసీఆర్ కూడా అన్నారని, ఈ అంశాన్ని ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా బీఆర్ఎస్ పెట్టిందని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్​నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్ లో మహేశ్​కుమార్​గౌడ్​ మీడియాతో మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క గుడిసెను కూడా ప్రభుత్వం తొలగించలేదని అన్నారు.  హైడ్రా టార్గెట్ భూ బకాసురులేనని స్పష్టం చేశారు. 90 శాతం మంది ప్రజలు మూసీ అభివృద్ధిని కోరుకుంటున్నారని,  హైడ్రా పనితీరును ప్రశంసిస్తున్నారని చెప్పారు. 

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిలో 80 శాతం మంది  బీఆర్ఎస్  నేతలే ఉన్నారని ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరెవరు? ఏ చెరువును కబ్జా చేశారు? అనే చిట్టా మొత్తం తన దగ్గర ఉన్నదని చెప్పారు. మూసీ ప్రక్షాళనలో పేదలకు ఏమాత్రం అన్యాయం జరగనీయమని తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. మూసీ ప్రక్షాళన జరగకపోతే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కూడా ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్​కు పెట్టుబడులు వస్తాయని తెలిపారు. నగర అభివృద్ధి అంటే ఫామ్​ హౌస్​ డెవలప్​మెంటా? అని ప్రశ్నించారు.

సోషల్ సెన్స్​లేకుండా సోషల్​మీడియా వాడకం

బీఆర్ఎస్, బీజేపీ..రెండు పార్టీలు కూడా సోషల్ సెన్స్ లేకుండా సోషల్ మీడియాను తమ స్వార్థానికి వాడుతున్నాయని మహేశ్​ కుమార్ ​గౌడ్​ విమర్శించారు. మంత్రి కొండా సురేఖపై జరుగుతున్న ట్రోలింగ్ పై  అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా మంత్రులపై అసభ్యకరంగా, అవమానకరంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుంటే కేటీఆర్, హరీశ్​ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై  ఇప్పటికైనా స్పందించాలని కోరారు. మానవత్వం లేకుండా సోషల్​మీడియాలో దిగజారి పోస్టులు పెడుతున్నారని ఫైర్​అయ్యారు. 

  రాష్ట్రంలో ఉన్న పద్మశాలి గుండెలు బాధపడుతున్నాయని, ఉద్యమాలు చేసి మంత్రిగా ఎదిగిన ఒక పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా  కన్నెర్ర జేస్తే బీఆర్ఎస్ ఉండదని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు చేయాలి కానీ..  ఒక బీసీ బిడ్డను ఇంతగా ఇన్సల్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయితే కేసు గురించి మాత్రమే తాము  మాట్లాడామని చెప్పారు. తెలంగాణ భవన్ కు చేనేత కార్మికులు వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే.. వారిపైనే బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. 

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వనరుల విధ్వంసం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వనరుల విధ్వంసం జరిగిందని మహేశ్​కుమార్​గౌడ్​ ఆరోపించారు. నీటితో మానవుడికి విడదీయలేని బంధమని, 3,500 చెరువులతో కళకళలాడిన హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉందో చూడాలని అన్నారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళనలో పేదలకు అన్యాయం జరిగిందంటూ సిరిసిల్ల వీరుడు కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను సీఆర్ఫీ ఎఫ్ జవాన్లతో నిర్బంధించారని, ఖమ్మంలో రైతుల చేతికి బేడీలు వేసి తీసుకె ళ్లలేదా? అని ప్రశ్నించారు.  పదేండ్లలో ఓల్డ్ సిటీని కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు.