పీసీసీ చీఫ్​గా నేడు మహేశ్​గౌడ్​ బాధ్యతల స్వీకరణ

పీసీసీ చీఫ్​గా నేడు మహేశ్​గౌడ్​  బాధ్యతల స్వీకరణ
  • గాంధీభవన్​లో రేవంత్ నుంచి బాధ్యతల స్వీకరణ
  • అనంతరం ఇందిరా భవన్ వద్ద బహిరంగ సభ
  • హాజరుకానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
  • రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలిరానున్న కాంగ్రెస్​ కేడర్
  • ముస్తాబైన గాంధీ భవన్.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్​పార్క్​కు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్​కు చేరుకుంటారు. గాంధీభవన్​లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ చాంబర్​లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2. 45 గంటలకు ప్రస్తుత పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి నుంచి మహేశ్ పీసీసీ చీఫ్​గా బాధ్యతలు తీసుకుంటారు. అనంతరం ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ ​రెడ్డితో పాటు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ కేడర్​ను ఉద్దేశించి మాట్లాడుతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. కొత్త పీసీసీ చీఫ్​ మహేశ్​కు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కేడర్ పెద్ద సంఖ్యలో గాంధీ భవన్​కు తరలిరానుంది. 

ముస్తాబైన గాంధీ భవన్​

పీసీసీ చీఫ్​గా మహేశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా గాంధీ భవన్​ను ముస్తాబు చేశారు. మొత్తం రంగులు వేయించి, కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. సభ ఏర్పాట్లను శనివారం మధ్యాహ్నం మంత్రి పొన్నం ప్రభా కర్ పరిశీలించారు. గాంధీ భవన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహేశ్ కుమార్ గౌడ్ ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. పీసీసీ చీఫ్​గా మహేశ్​ కుమార్​ గౌడ్​ బాధ్యతలు స్వీకరిస్తున్నందున ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఆదివారం సీఎం రేవంత్​తో పాటు మంత్రులందరూ, ఇతర ముఖ్య నేతలు దాదాపు రెండు గంటల పాటు గాంధీ భవన్​లో ఉండనుండడంతో శనివారం సాయంత్రం నుంచే పోలీసులు దాని పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టబమైన ఏర్పాట్లు చేశారు.