- ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
- కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పిలుపు
- హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి
- తెలియకుండా చెరువుల దగ్గర జాగాలు కొన్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి
- ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలని సీఎంకు వినతి
హైదరాబాద్, వెలుగు: దమ్ము, ధైర్యంతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చామని పీసీసీ కొత్త చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘‘కేసీఆర్ స్థాయిలో ఆయన వాడిన భాషలోనే పీసీసీ చీఫ్ గా రేవంత్ గట్టి కౌంటర్ ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. నేతలంతా కలిసి కట్టుగా ముందుకు సాగడంతోనే అధికారంలోకి రాగలిగాం. రాబోయే రోజుల్లో ఆ దమ్ము, ధైర్యాన్ని మరింతగా చూపించాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడినైనా కార్యకర్తగానే ఉంటానన్నారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గాంధీ భవన్ తనకు దేవాలయం లాంటిదని, భవన్‌తో తనది 40 ఏండ్ల అనుబంధం అని, ఇందులో తాను తాకని చోటంటూ లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువని, అయితే కీలక సమయంలో విభేదాలు పక్కకు పెట్టి, సీనియర్లంతా కలిసికట్టుగా ఉండడంతోనే తాము అధికారంలోకి వచ్చామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నెలలో కనీసం రెండుసార్లయినా గాంధీ భవన్ కు ముఖ్యమంత్రి రావాలని, సెక్యూరిటీ రీత్యా కొంత ఇబ్బంది అయినా వీలు చేసుకొని కార్యకర్తల కోసం రావాలని కోరారు. మంత్రులు కూడా ప్రతి వారంలో బుధ, శుక్రవారాల్లో ఒక్కో మంత్రి గాంధీ భవన్ కు రావాలని ఆయన అన్నారు. మంత్రులు జిల్లా పర్యటనలో విధిగా పార్టీ ఆఫీసులను సందర్శించాలని సూచించారు.
తాను పీసీసీ అధ్యక్షుడ్ని అవుతానని అనుకోలేదని, రాజకీయాల్లో ఎంత కష్టపడి పని చేసినా ఒక్క శాతం అదృష్టం కూడా ఉండాలని, అందుకే తనకు ఎమ్మెల్సీ, పీసీసీ పదవి వచ్చిందని చెప్పారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, గాంధీ భవన్ లో పవర్ సెంటర్ లు లేవని, ఉన్నదల్లా ఒక్కటే పవర్ సెంటర్ అని, అది రాహుల్ గాంధీ పవర్ సెంటర్ అని తెలిపారు. గాంధీభవన్ లో రోజూ 6 గంటలు ఉంటానని, రెండు ఇరానీ చాయ్ లు తాగుతానని అన్నారు.
హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి
కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్ల ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు ఆయన ఇంటి మీద దాడి చేశారని మహేశ్‌గౌడ్ తెలిపారు. ‘‘బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా వాడ్తున్నరు” అని విమర్శించారు. హైడ్రా అనేది చారిత్రక నిర్ణయమని, హైదరాబాద్ అనేది రాక్స్, లేక్స్ సిటీ అని తెలిపారు. హైడ్రాను హైదరాబాద్ కు పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరించాలన్నారు. తెలియకుండా చెరువుల దగ్గర భూములు కొనుక్కున్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలని సీఎంను కోరారు. కాంగ్రెస్‌కు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలని, ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలన్నారు.