మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి భూఆక్రమణలను నిరూపిస్తా : మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డితో పాటు ఆయన సమీప బంధువులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, వాటిని తాను నిరూపిస్తానని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకవేళ రుజువు చేయకపోతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, దీనికి మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కూడా సిద్ధమేనా అని ప్రశ్నించారు. గురువారం ఆయన నిర్మల్ లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల భూముల ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ ​చేశారు.

డీ వన్ పట్టాలు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ ఎన్​ఓసీలు తీసుకొని ఆక్రమించుకుంటున్నారన్నారు. సోఫీనగర్ ప్రాంతంలోని ఇండస్ట్రియల్ భూములను ఎలాంటి కన్వర్షన్లు లేకుండా, డీటీసీపీ అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేస్తున్నారన్నారు. ఇదే ప్రాంతంలోని ఎఫ్​టీఎల్​లో ఉన్న భూమిని ఆక్రమించుకుని మట్టితో నింపి ఓ బడా మార్ట్ కు విక్రయించారని ఆరోపించారు. ప్రైవేట్ భూముల యజమానులను బెదిరించి జాగలను తక్కువ ధరకు కొంటూ అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములు, డీ1 పట్టాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. ఇసుక, కంకర దందాల్లో కూడా అధికార పార్టీ నేతల హస్తం ఉందన్నారు. శాంతినగర్ లో పేదలు కట్టుకున్న ఇండ్లను అసైన్డ్ భూముల పేరిట కూల్చివేశారని, ఇదే అసైన్డ్ భూముల్లో బడాబాబులు కట్టుకున్న ఫంక్షన్ హాల్స్, అపార్ట్​మెంట్లు, బిల్డింగులను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యం రెడ్డి, బాపురెడ్డి, నాందేడపు చిన్ను తదితరులు పాల్గొన్నారు.