
నిర్మల్, వెలుగు: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా సీఎం కేసీఆర్ వారిని మద్యానికి బానిస చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సీఎంకు బ్రాండీ షాపులపై ఉన్న ప్రేమ బడులపై లేదన్నారు. ఆదివారం లక్ష్మణ చందా మండలం బోరిగాం, మంజులాపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు బీజేపీలో చేరారు. వారికి మహేశ్వర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతల అక్రమాలను బయటపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నేత భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.