నేడు ( 8న ) లక్ష మందితో మహిళా దినోత్సవ సభ

నేడు ( 8న ) లక్ష మందితో మహిళా దినోత్సవ సభ
  • ప‌‌రేడ్ గ్రౌండ్ వేదిక‌‌గా మంత్రి సీత‌‌క్క అధ్యక్షతన నిర్వహణ
  • హాజ‌‌రుకానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు
  • ఇందిరా మ‌‌హిళా శ‌‌క్తి మిష‌‌న్-2025 ఆవిష్కర‌‌ణ‌‌

హైదరాబాద్, వెలుగు: అంత‌‌ర్జాతీయ మ‌‌హిళా దినోత్సవాన్ని పుర‌‌స్కరించుకొని సికింద్రాబాద్​లోని ప‌‌రేడ్ గ్రౌండ్ వేదిక‌‌గా రాష్ట్ర ప్రభుత్వం మ‌‌హిళా స‌‌ద‌‌స్సు నిర్వహిస్తున్నది.  పంచాయ‌‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌‌హిళా శిశు సంక్షేమ శాఖ‌‌ల మంత్రి సీత‌‌క్క అధ్యక్షత‌‌న స‌‌భ జ‌‌ర‌‌గనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం  సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు వేడుకలు జరుగనున్నాయి. ఈ సభకు లక్షమంది మహిళలు హాజరు కానున్నారు. 

ఈ నేపథ్యంలో  మ‌‌హిళ‌‌ల స‌‌మ‌‌క్షంలో ఇందిరా మ‌‌హిళా శ‌‌క్తి మిష‌‌న్-–2025  ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్‌‌లో మ‌‌హిళా సంఘాలు ఈ ఏడాది సాధించిన విజ‌‌యాల‌‌తోపాటు మ‌‌హిళా సాధికార‌‌త బ‌‌లోపేతం కోసం ప్రభుత్వం త‌‌ల‌‌పెట్టిన కార్యక్రమాలను పొందుప‌‌రిచారు.  సీఎంతోపాటు  మంత్రులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.  

ఈ నేపథ్యంలో శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్​, ఆర్​ అండ్​  బీ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్  మహేశ్​ భగవత్, సెర్ప్​ సీఈవో  దివ్య దేవరాజన్,  కలెక్టర్ అనుదీప్ తో కలిసి మంత్రి సీతక్క అక్కడ ఏర్పాట్లను  పరిశీలించారు. అధికారుల‌‌కు పలు సూచ‌‌న‌‌లు చేశారు.

అందుబాటులో 600 బస్సులు 

మ‌‌హిళా సంఘాల స‌‌భ్యుల‌‌ను స‌‌భ‌‌కు ఆహ్వానిస్తూ మంత్రి సీత‌‌క్క స్వయంగా జిల్లా మ‌‌హిళా స‌‌మాఖ్యల‌‌కు ఆహ్వానాలు పంపారు. జిల్లాల నుంచి వ‌‌చ్చే మ‌‌హిళ‌‌ల కోసం 600 కు పైగా ఆర్టీసీ బస్సుల‌‌ను సెర్ప్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. దీంతోపాటు జిల్లాకొక అధికారిని నియ‌‌మించి బాధ్యత‌‌లు అప్పగించారు. సాయంత్రం స‌‌భ ప్రారంభం కానున్న నేప‌‌థ్యంలో మ‌‌హిళ‌‌లంతా అర‌‌గంట ముందే స‌‌భా స్థలికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. 

దూర ప్రాంతాల నుంచి మ‌‌హిళ‌‌లు వ‌‌చ్చే అవ‌‌కాశాలుండ‌‌డంతో 8 గంట‌‌లలోపు స‌‌భ‌‌ను ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.   స‌‌భ‌‌కు వ‌‌చ్చే మ‌‌హిళ‌‌ల‌‌కు ఎలాంటి అసౌక‌‌ర్యం కలగకుండా చూడాలని, మంచినీటి సదుపాయం కల్పించాలని మంత్రి సూచించారు.  వేడుకల్లో భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 250 మంది కళాకారులతో  పలు రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.  కాగా, అనంతరం సెక్రటేరియెట్​లో  జిల్లా డీఆర్డీఏ, జిల్లా మ‌‌హిళా స‌‌మాఖ్య స‌‌భ్యుల‌‌తో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 

నేటి కార్యక్రమాల వివరాలు..  

మండల మహిళా సమాఖ్య సంఘాలతో  న‌‌డపనున్న 150 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్, మంత్రులు​ పచ్చా జెండా ఊపి, ప్రారంభిస్తారు.  మ‌‌హిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సంద‌‌ర్శిస్తారు. వేదిక‌‌పై 31 జిల్లా స‌‌మాఖ్యల‌‌తో 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీల‌‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 

మ‌‌హిళా సంఘ స‌‌భ్యుల‌‌కు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కుల‌‌ను అంద‌‌జేస్తారు. మ‌‌హిళా సంఘాల‌‌కు రుణ స‌‌దుపాయన్ని క‌‌ల్పిస్తూ చెక్కును జిల్లా మ‌‌హిళా స‌‌మాఖ్య అధ్యక్షుల‌‌కు ఇస్తారు. జిల్లా మ‌‌హిళా స‌‌మాఖ్య స‌‌భ్యుల‌‌కు యూనిఫాం చీర‌‌లను పంపిణీ చేయనున్నారు. మహిళా సంఘాల ద్వారా 64  మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల  శంకుస్థాపన వర్చువల్​గా చేయనున్నారు. 

ప్రజా ప్రభుత్వాన్ని  ఆశీర్వదించండి: మంత్రి సీతక్క

లింగ వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలకు వివిధ కార్యక్రమాలు చేపట్టి, సపోర్ట్ చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. ప్రజా  ప్రభుత్వాన్ని మహిళలంతా ఆశీర్వదించాలని కోరారు.  ఈ మేరకు సీతక్క శుక్రవారం ఒక  ప్రకటన విడుదల చేశారు.  మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని చెప్పారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయం అని పేర్కొన్నారు.  ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.