- ఈ కార్యక్రమానికి అధికారులే అంబాసిడర్లు: మంత్రి సీతక్క
- గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
- బిజినెస్ మోడల్స్ గుర్తించాలని అధికారులకు సూచన
- నేడు మహిళా శక్తి క్యాంటీన్లు ఓపెనింగ్
హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో మహిళా శక్తి కార్యక్రమంపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ఇందులో డీఆర్ డీవోలు, అడిషనల్ డీఆర్డీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధార్ కేంద్రాలు, మీ సేవా సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్, క్యాంటీన్లు తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ‘‘కొత్తగా ప్రారంభించనున్న మహిళా శక్తి క్యాంటీన్లు క్లీన్ గా ఉండాలి. వాటిల్లో క్వాలిటీ ఫుడ్ అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా మారాలి. పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారుల వెంట, రద్దీ ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి” అని అధికారులకు సూచించారు. అచ్చమైన పల్లె రుచులను పట్టణాలకు పరిచయం చేయాలన్నారు.
ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు..
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ ఉండాలని సీతక్క అన్నారు. వచ్చే ఐదేండ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామని చెప్పారు. ‘‘స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించగలం. మహిళా సంఘాల కోసం మంచి బిజినెస్ మోడల్స్ ను అధికారులు గుర్తించాలి. డీఆర్డీవోలు జిల్లాల్లో పర్యటించి మహిళా సంఘాల అనుభవాలు తెలుసుకోవాలి. అందుకోసం వారం పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి” అని సూచించారు. స్కూల్ యూనిఫామ్స్ ను సకాలంలో అందించినందుకు డీఆర్డీవోలను అభినందించారు. అదే స్ఫూర్తితో మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న విద్యార్థులకు మరో జత యూనిఫామ్ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళలు అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వానికే రుణాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని అన్నారు. మహిళా శక్తికి అధికారులే బ్రాండ్ అంబాసిడర్లు అని, మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంపై త్వరలోనే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ కమిషనర్ షఫీవుల్లా, టీజీఐఆర్డీ సీఈవో కాత్సాయిని తదితరులు పాల్గొన్నారు.
నేడు మహిళాశక్తి క్యాంటీన్ల ఓపెనింగ్
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న మహిళా శక్తి క్యాంటీన్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించనున్నారు. సెక్రటేరియెట్ లోని గ్రౌండ్ ఫ్లోర్, మూడో ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన రెండు క్యాంటీన్లను ఆమె ఓపెనింగ్ చేయనున్నారు. ఈ రెండు క్యాంటీన్ల నిర్వహణను మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మహిళా సంఘాలకు అప్పగించినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) అధికారులు తెలిపారు. వీటిలో ప్రస్తుతం పిండి వంటలు అమ్ముతామని.. వచ్చే నెలలో టిఫిన్స్, మీల్స్, స్నాక్స్ ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలో కలెక్టరేట్లు, టెంపుల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఇండస్ర్టియల్ పార్క్ లతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా టూరిజం ప్లేసులలో, హైదరాబాద్ లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, నేషనల్ హైవేల వెంబడి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుందన్నారు. ‘‘క్యాంటీన్లను రెండు కేటగిరీలుగా విభజించాం. మొదటిది రూ.25 లక్షల పెట్టుబడితో, రెండోది రూ.15 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేస్తాం. ఇందులో మహిళా సంఘం పెట్టుబడి 10 శాతం ఉంటుంది. 70 శాతం స్ర్తీనిధి పథకం కింద, మిగతా 20 శాతం గ్రాంట్ గా రిలీజ్ చేస్తాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే క్యాంటీన్లకు ఫ్రీ లేదంటే నామమాత్రపు అద్దె వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది” అని సెర్ఫ్ అధికారులు తెలిపారు. క్యాంటీన్ల నిర్వహణపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం(నిథమ్), కేరళలో అమలవుతున్న కుటుంబశ్రీ ఎన్ఆర్ వో (నేషనల్ రీసోర్స్ ఆర్గనైజేషన్)తో మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు చెప్పారు.