
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో రూ.కోటితో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీ నగర్, డివిజన్ల పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం ఇటీవల రూ.22 కోట్లు కేటాయించిందని తెలిపారు.
వీటితోపాటు ప్రతి వార్డులో ఓపెన్ జిమ్, పార్కులు, వాకింగ్ ట్రాక్ ల నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అలీ అబ్బాస్ జాతరలో..
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో ప్రతిఏటా నిర్వహించే అలీ అబ్బాస్ జాతరకు శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. పీర్లకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ ప్రవీణ విజయ్ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేశ్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.