నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని హోం శాఖ మంత్రి మహమూద్‌అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అష్రుఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రూ.2 కోట్లతో నిర్మించిన ఎకో పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం అంజనా గార్డెన్లో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైనార్టీ మహిళలకు 250 కుట్టు మిషన్లు అందజేశారు.
ఈసందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ 70 ఏండ్లుగా పేద మైనార్టీల గురించి ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్మైనార్టీల కోసం కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారని చెప్పారు. దీనిని ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. కొత్త పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నాయని చెప్పారు. మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ ఇంతియాజ్‌ఇసాక్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
మహబూబ్ నగర్ రూరల్: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. రూరల్ మండలం అప్పాయపల్లి గ్రామంలో ఐమాక్స్ లైట్లు, డ్వాక్రా భవనాన్ని ప్రారంభించారు. రూ.12 లక్షలతో చేపట్టిన మహిళా సమైక్య భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను శ్రీనివాస్ గౌడ్ ఎంతో అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మల్లు నరసింహారెడ్డి, సుధాశ్రీ, వెంకటేశ్వరమ్మ, అనిత, ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.