తన లోక్‌సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్‌సభ నుంచి బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు . ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేశారు . తన సభ్యత్వాన్ని రద్దు చేయడంపై స్టే విధించాలని ఫిటిషన్ లో కోరారు.
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 8న క్యాష్ ఫర్ క్వెరీ కేసులో మొయిత్రాను దోషిగా నిర్ధారించిన ఎథిక్స్ కమిటీ నివేదికను సభ ఆమోదించిన తర్వాత ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు.
అదానీ గ్రూప్ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు. సస్పెన్షన్ ముందు వరకు ఆమె పశ్చిమ బంగాల్‌లోని కృష్ణా నగర్ ఎంపీగా ఉన్నారు.