రీల్స్ చేయడానికి DSLR camera కొనుక్కోవడం కోసం ఓ మహిళ పనిచేసే ఇంటికే కన్నమేసింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతుంది. నీతూ యాదవ్ అనే మహిళ తన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రాంలో వీడియోలు చేయడం కోసం Nikon DSLR camera కొనాలని డిసైడ్ అయింది. కెమెరా కొనడానికి డబ్బుల కోసం పని చేసే ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలను దొంగతనం చేసింది. ఆ బంగారం, వెండి దొంగిలించాక నీతూ కనిపించకుండాపోయింది. దీంతో ఇంటి యజమానికి అనుమానమొచ్చి పని మనిషిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నీతూ యాదవ్ మొబైల్ నంబర్కు పోలీసులు కాల్ చేయగా స్విచాఫ్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నీతూ లొకేషన్ను కనిపెట్టారు.
ఢిల్లీ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల విచాణలో ఆమె కొన్ని విషయాలను బయటపెట్టింది. తనది రాజస్థాన్ అని, తన భర్త డ్రగ్స్ కు బానిస అయి చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపింది. ఆ బాధలు పడలేక అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చేసి బంగళాల్లో పని మనిషిగా చేస్తున్నానని పోలీసులకు వెల్లడించింది. కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రాంలో తాను చేసిన రీల్స్ను అప్ లోడ్ చేసినట్లు చెప్పింది. DSLR Camera అయితే వీడియోలు క్వాలిటీగా ఉంటాయని ఎవరో సలహా ఇవ్వగా ఆ కెమెరా ఎంత ధర ఉంటుందో నీతూ యాదవ్ గూగుల్లో వెతికింది. DSLR Camera కాస్ట్లీ అని తెలియడంతో తెలిసిన వాళ్లను, బంధువులను అప్పు అడిగింది. ఎవరూ అప్పు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఆ డబ్బులు ఎలా సమకూర్చుకోవాలనే ఆలోచన చేసింది. అప్పుడే ఈ దొంగతనం ఆలోచన పుట్టింది. ద్వారకలో ఒక ఇంట్లో పనిచేస్తుండగా ఆ ఇంట్లో లక్షల విలువ చేసే బంగారం, వెండి నగలు ఉన్నట్లు నీతూ యాదవ్ తెలుసుకుంది. చివరకు ఆ నగలను దొంగిలించి రీల్స్ వ్యామోహంలో పడి రియల్ లైఫ్ను చేజేతులా చిక్కుల్లోకి నెట్టుకుంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరిగి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక వినోదం అరచేతిలోకి వచ్చినట్టయింది.
ఇన్స్టాగ్రాం లాంటి ఫొటో అండ్ వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్స్ను ప్రజలు కాలక్షేపానికి కేరాఫ్గా ఎంచుకుంటున్నారు. ఇన్స్టాగ్రాం కూడా ట్రెండ్కు తగ్గట్టుగా రీల్స్ లాంటి ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ రీల్స్ చూసి ఆనందించే వారి కంటే ఈ మధ్య చేసి సంబురంగా ఫీలవుతున్న వాళ్లు ఎక్కువైపోయారు. ఇలా రీల్స్ చేస్తున్నవాళ్లలో.. కొందరు కంటెంట్ క్రియేటర్స్గా మంచి పేరు తెచ్చుకుంటుంటే.. మరికొందరు మీమ్ మెటీరియల్గా మారిపోతున్నారు. ఈ రీల్స్ చేయడం కొందరికి వ్యసనంగా మారి అందుకోసం నేరాలకు కూడా పాల్పడుతున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే ఇది.