- నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి
- రేపు ఎర్రవల్లి చౌరస్తాకు రాహుల్ గాంధీ
- 10న నారాయణపేటకు ప్రధాని మోదీ
మహబూబ్‌నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు లోకసభ స్థానాలపై ప్రధాన పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీతో పాటు సిట్టింగ్ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్, రెండు స్థానాల్లో విజయం సాధించి ఆధిపత్యం చలాయించాలని బీజేపీ సర్వశక్తులొడ్డుతున్నాయి. ఎన్నికలకు వారం రోజుల టైం ఉండడంతో ఈ స్థానాల పరిధిలో రాష్ట్ర, జాతీయ స్థాయి లీడర్లతో సభలు, కార్నర్ మీటింగ్ లు, రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి విస్తృత పర్యటనలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో నాగర్‌కర్నూల్, పాలమూరు లోక్‌సభ స్థానాలున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలోని ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి మహబూబ్‌నగర్ స్థానానికి చల్లా వంశీచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి పోటీలో ఉన్నారు.
వీరికి మద్దతుగా సీఎం ఇప్పటికే కొడంగల్, కోస్గి, మద్దూరు, మహబూబ్‌నగర్, నారాయణపేట, బిజినేపల్లిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడారు. తాజాగా కొత్తకోటలో శనివారం సాయంత్రం సీఎం వంశీచంద్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. వచ్చే వారం మక్తల్ కేంద్రంగా జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొనే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
పాలమూరుకు మోదీ.. కందనూలుకు షా..
ప్రధాని మోదీ గత నెల 17న నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీజేపీ క్యాండిడేట్ భరత్ ప్రసాద్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. అదే నెల ఆయనకు మద్దతుగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పర్యటించారు. త్వరలో ఇదే పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 10న ప్రధాన మంత్రి నారాయణపేటకు రానున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహంచే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా డీకే అరుణకు మద్దుతుగా నిర్వహించే రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలిసింది.
కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనలు..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ క్యాండిడేట్లు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లకు మద్దతుగా కేసీఆర్ ఇటీవల మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లో నిర్వహించారు. రానున్న వారంలో ఆ పార్టీ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటించనున్నట్లు తెలిసింది. భూత్పూర్, కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, నాగర్‌కర్నూల్‌లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఆదివారం రాహుల్ గాంధీ సభ..
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ అనంతరం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. అయితే రాహుల్ గాంధీ ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాకు రావడం ఇది ఐదో సారి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచార సభకు, మహబూబ్‌నగర్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు.