- కులసంఘాలతో ప్రధాన పార్టీల ఆత్మీయ సమావేశాలు
- ఆయావర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం
- గంపగుత్త ఓట్లపై ఆశలు
కామారెడ్డి, వెలుగు: గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు ఆయా కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆయా వర్గాల ఓట్లను గంపగుత్తగా తమవైపు తిప్పుకుంటే విజయానికి మరింత చేరువైతామనే వ్యూహంతో గ్రామాలు, టౌన్లలో కుల సంఘాలతో మీటింగ్లు నిర్వహిస్తున్నారు. మీటింగ్లు నిర్వహించడానికి వీలుకాని పక్షంలో కుల పెద్దలతో భేటీ అయ్యి మద్దతు కోరుతున్నారు.
ఓట్లు ఎక్కువగా ఉన్న కుల సంఘాల ముఖ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పొద్దంతా ప్రచారాలు నిర్వహిస్తున్న ఆయా పార్టీల క్యాండిడేట్లు రాత్రి సమయాల్లో సంఘాలతో సమావేశమవుతున్నారు. కొందరు బహిరంగంగా మీటింగ్లు నిర్వహిస్తుంటే, మరికొందరు రహస్యంగా సమావేశమవుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో కుల సంఘాల వారీగా ఓట్ల సమీకరణకు ప్రధాన పార్టీల నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లలో ఆయా కులాలకు గల్లీ సంఘాలు ఉన్నాయి.
కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కాంగ్రెస్తరఫున టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ తరఫున ఉమ్మడి జిల్లా పరిషత్మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల స్టేట్ చీఫ్లు ముఖాముఖి తలపడుతుండడంతో ఇక్కడి ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పరిస్థితుల్లో గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేతలు కుల సంఘాల ప్రతినిధులు, ప్రెసిడెంట్లు, సెక్రెటరీలతో సంప్రదింపులు చేశారు.
కామారెడ్డి టౌన్లో అధిక ఓట్లు ఉన్న కుల సంఘాల వారితో మీటింగ్లు పెట్టారు. వారికున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఇటీవల ఓ పార్టీకి చెందిన ముఖ్యనేత ఓ కుల సంఘానికి చెందిన ముఖ్య లీడర్లతో పాటు, ఆ కుల సంఘానికి సంబంధించిన గల్లీ సంఘం ప్రెసిడెంట్లు, సెక్రెటరీలతోనూ సమావేశమై మద్దతు కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వివిధ కులసంఘాల ముఖ్యులు, సభ్యులతో మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చేది తామేనని, సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. బీజేపీ నేతలు సైతం మీటింగ్లు నిర్వహించి మద్దతు కోరుతున్నారు.
మిగతా నియోజకవర్గాల్లోనూ..
ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు సామాజికవర్గాల వారీగా మీటింగ్లు నిర్వహిస్తున్నారు. కుల సంఘలకు హామీలిచ్చి వారి ఓట్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటేసి తమను గెలిపిస్తే కుల సంఘాల బిల్డింగ్లు, ఇతర అభివృద్ధి పనులు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు.