
‘అమెరికా తుమ్మితే.. ఇండియాకు సర్దయితది’.. మన స్టాక్ మార్కెట్లలో తరచూ వినిపించే ఊత పదం ఇది. మన మార్కెట్లు వరుసగా కుప్పకూలడానికి అమెరికా అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే మన స్టాక్ మార్కెట్లకు పండుగే అని నిరుడు చాలా మంది మిడిల్క్లాస్పబ్లిక్పెట్టుబడులు పెట్టారు. నవంబర్ మొదటి వారంలో ట్రంప్ గెలిచారని తెలియగానే.. వరుసగా అమెరికా మార్కెట్లు పెరుగుతూ పోయాయి. రికార్డులు సృష్టించాయి. అదే రీతిలో మన మార్కెట్లు పెరుగుతాయనుకుంటే.. రివర్స్ అయ్యాయి.
అంతకు ముందు సెప్టెంబర్ నుంచే ప్రారంభమైన మన మార్కెట్ల పతనం ట్రంప్ గెలుపుతో మరింత పతనమయ్యాయి. గత నెల 20న అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్ వార్ మొదలు పెట్టడంతో అప్పటి నుంచి బుధవారం కూడా దాదాపు ప్రతిరోజూ నెగెటివ్లోనే స్టాక్ మార్కెట్ఇండెక్స్లు క్లోజ్ అవుతున్నాయి.
మన మార్కెట్లను ఎక్కువగా నడిపేది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(ఎఫ్ఐఐ).. ఆ తర్వాత స్థానంలో డొమెస్టిక్స్ ఇన్స్టిట్యూషనల్ఇన్వెస్టర్స్(డీఐఐ) ఉంటారు. ఆగస్టు నుంచి వరుసగా ఎఫ్ఐఐలు మన మార్కెట్లను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ప్రతి నెలా వేల కోట్లలో సేల్ చేస్తున్నారు.
నిరుడు అక్టోబర్లో అయితే లక్ష కోట్లకు పైగా సేల్ చేశారు. ఎఫ్ఐఐలు మన దగ్గరి నుంచి వెళ్లిపోవడంతోనూ స్టాక్ మార్కెట్లు నేలచూపుచూస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొందని వార్తలు వస్తే చాలు మన మార్కెట్లు పడిపోయేవి. ఇప్పుడు ఆ యుద్ధ వాతావరణం కన్నా.. అమెరికా టారిఫ్ దెబ్బతోనే భారీగా పడిపోతున్నాయి.