బీఆర్ఎస్పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయ్

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. బీఆర్ఎస్ పెద్దలు తమ నియోజకవర్గాలనే అభివృద్ధి చేసుకుంటున్నారని..ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో చెప్పినట్టు విన్నవాళ్లకే ఉన్నత పదవులు ఇస్తు్న్నారని ఆరోపించారు. ప్రభుత్వ జాగలు అమ్మేస్తున్నారని...ఆర్టీసీ జాగలు అమ్మేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని చెప్పారు. 

తెలంగాణలో సిన్సియర్ గా ఉన్న వాళ్ళను కొనేస్తున్నారని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కోసం ర్యాలీ తీస్తే అడ్డు పడుతున్నారని విమర్శించారు.  గ్రామాలకు నిధుల విడుదల ఆగిపోయ్యాయని.. ఏం పాపం చేశాయని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లా తిరిగానని...ప్రతి మండలంలో కార్యకర్తలతో మీటింగ్ లు పెట్టానని చెప్పారు.  మైనంపల్లి భయపడి పారిపోయే వ్యక్తి కాదన్నారు. హైదరాబాద్ లో  తన దగ్గరకు వచ్చిన వారిని ఆదుకున్నానని... నమ్ముకున్న వారికి ప్రాణమిస్తానని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మెదక్ జిల్లాలోని  ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్నాని మైనంపల్లి చెప్పారు. మెదక్ చర్చి, దర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కానీ తాను మెదక్ వెళ్లడంపై కొందరు పారాచూట్ తో  దిగారని విమర్శిస్తున్నారని...ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వారి సొంత ఊరు  ఇదేనా అని ప్రశ్నించారు.  మెదక్ జిల్లాలో  టిడిపి అధ్యక్షునిగా పనిచేసి.. రోజుకు 450 కిలో మీటర్లు తిరిగానని...రెండు సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యానని గుర్తు చేశారు. కొందరు నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని...డబ్బుల సంచులతో వస్తున్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. డబ్బు సంచలతో జనాలను మభ్యపెట్టడం తమకు రాదన్నారు. 

తెలంగాణలో ఆరున్నర లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ కే  దక్కిందన్నారు మైనంపల్లి. ప్రతి మనిషి మీదా లక్షన్నర రూపాయల అప్పు ఉందని చెప్పారు. మా సొమ్ము తో మీ పెత్తనం ఏంటిదని నిలదీశారు. దళితులు,బిసిలు, మైనార్టీలతో కేసీఆర్ ఇంటిని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.