ట్రంప్‌కు మరో షాక్‌.. పోటీకి అనర్హుడంటూ మరో రాష్ట్రం వేటు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు బరిలోకి దిగిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే  దేశాధ్యక్షుడి పదవికి ఆయన అనర్హుడంటూ ఇటీవల కొలరాడో  సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తాజాగా మరో రాష్ట్రం ఆయన మీద వేటు వేసింది.  మైన్‌ ప్రైమరీ బ్యాలెట్‌ పోరు నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.  

మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు. అయితే  కొలరాడో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పబ్లికన్‌ పార్టీ  సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.   అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ట్రంప్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. కాగా  అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్‌ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇదంతా బైడెన్​ కుట్ర: ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తనపై అనర్హత వేటు వేస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా స్పందించారు. ఇదంతా అధ్యక్షుడు జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుట్రేనని విమర్శించారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేయకుండా నన్ను నిలువరించేందుకు జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయన సమూహం చేస్తున్న విపరీత చర్యలివి. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాస్వామ్యానికి ముప్పు. ఓడిపోతారనే ఇలా చట్టసంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు’’ అని ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు.