
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇండియన్ మీడియాపై తన విమ్శలను ఎక్కుపెట్టాడు. మహారాష్ట్రలో ఒకవైపు రాజకీయంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కునాల్.. మరోసారి మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశాడు.
ఇండియన్ మీడియా ప్రభుత్వానికి మౌత్ పీస్ లాగా మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు కునాల్. దేశంలో ఉన్న అసలైన సమస్యలను ఫోకస్ కాకుండా ప్రజలను డైవర్ట్ చేయడమే మీడియా పని అని అన్నాడు. నిజాలను చెప్పకుండా తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, ప్రజల దృష్టి మళ్లిండమే ఇప్పుడున్న మీడియాపని అని విమర్శించాడు.
‘‘ప్రస్తుత సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పుకోవడానికి ఏమీ లేదు.. జీరో. అధికార పార్టీ కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఒక విభాగం మాత్రమే. దేశ ప్రజలకు అవసరం లేని విషయాలను రిపోర్ట్ చేస్తూ రాబందులు. ఈ సంస్థలు ఎంత తొందరగా మూత పడితే దేశానికి అంత మేలు చేసినవి అవుతాయ్’’ అని తీవ్రంగా ఎక్స్ లో ట్వీట్ చేశాడు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ( మార్చి 23 )రాత్రి ముంబైలోని యూని కాంటినెంటల్ హోటల్ లో నిర్వహించిన స్టాండప్ కామెడీ షోలో ఈమేరకు వ్యాఖ్యలు చేశారు కునాల్ కమ్రా. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేను గద్దర్ (ద్రోహి) అంటూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా దిల్ తో పాగల్ హై సినిమా పాటను పేరడీ చేస్తూ సెటైర్లు వేశారు కునాల్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి.
కునాల్ వ్యాఖ్యలతో మహారాష్ట్రలో వాతావరణం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. కునాల్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఏక్ నాథ్ షిండే మద్ధతు దారులు ఆయన ఆఫీస్ ను కూల్చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం కూడా కునాల్ ఆఫీస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కూల్చేందుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన స్టూడియోను బృహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు కూల్చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ తీరుపై విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. వాక్ స్వేచ్ఛను అణచేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అధికార బీజేపీ కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.