పల్లెల్లో ట్రాక్టర్ల పంచాయితీ.. భారంగా మారుతున్న ట్రాక్టర్ల నిర్వహణ

  • భారంగా మారుతున్న ట్రాక్టర్ల నిర్వహణ
  • సొంత పనులకు వాడుకుంటున్న కాంట్రాక్టర్లు

నిజామాబాద్​రూరల్, వెలుగు: గ్రామ పంచాయతీల అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు అదనపు ఆదాయాన్ని సైతం సమకూర్చుకోవచ్చనే లక్ష్యంతో కొనుగోలు చేసిన ట్రాక్లర్లు పంచాయతీలకు పెనుభారంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, అఫీసర్ల ఒత్తిడితో ట్రాక్టర్లను కొనుగోలు చేసినప్పటికి మేజర్​ పంచాయతీల్లో మినహా ఇతర పంచాయతీల్లో పెద్దగా ఉపయోగపడడంలేదు. దీనికితోడు ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్​ఖర్చులు,  డ్రైవర్​ వేతనం చెల్లించడం వంటివి పంచాయతీల మెడకు చుట్టుకున్నాయి. దీంతో చాలా గ్రామాల్లో ట్రాక్టర్లను వినియోగించకుండా వృథాగా వదిలేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, ఇతర కాంట్రాక్టు పనుల కోసం వీటిని వినియోగిస్తున్నారు.

ట్రాక్టర్ల లక్ష్యం ఇదీ...

ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనుల్లో భాగంగా పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్కల పెంపకం తదితర అవసరాలకు ఉపయోగపడేందుకు సొంతంగా ట్రాక్టర్లు కొనుగోలు చేశాయి. ట్రాలీ సాయంతో గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరించడం, కూడళ్లు, ఇతర ఖాళీ ప్రాంతాల్లో పేరుకుపోయే చెత్త నిల్వలను తరలించడం వంటి పనులు చేయాలి. ఇక ట్యాంకర్​ సాయంతో హరితహారం మొక్కలకు నీటిని అందిస్తున్నారు. తద్వారా ప్రైవేటు ట్రాక్టర్లకు కిరాయి చెల్లించే భారం తప్పడంతోపాటు హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా ఈజీఎస్​ పథకం నుంచి ఆదాయం సమకూర్చుకోవచ్చు.

ఆదాయం శూన్యం.. ఆర్థికభారం..

ట్రాక్టర్లతో ఆదాయం మాట ఏమోగాని వాటితో ఆర్థికభారం మాత్రం తప్పడంలేదని సర్పంచులు వాపోతున్నారు. హరితహారం మొక్కలకు ఏడాది పొడవునా నీరు అందించే వీలుపడదు. కేవలం మూడు నెలలకు మాత్రమే మొక్కకు రూ.1.40పైసల చొప్పున చెల్లిస్తారు. ఇక చెత్త సేకరణతో ఎటువంటి ఆదాయం ఉండదు. కానీ ట్రాక్టర్లకు ప్రతి నెలా కనీసం రూ.10వేల వరకు డీజిల్​ ఖర్చులు, డ్రైవర్​కు రూ.5వేల వరకు వేతనం, చిన్నచిన్న రిపేర్లకు ఖర్చులు కలుపుకొని ప్రతి నెలా రూ.20వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక కిస్తీల రూపంలో కొనుగోలు చేసిన పంచాయతీలు వాటిని చెల్లించడానికి నానాతంటాలు పడుతున్నాయి.

పక్కదారి పడుతున్న ట్రాక్టర్లు..

ట్రాక్టర్ల నిర్వహణ, ఆర్థిక భారం ఒకవంతైతే, ఈ ట్రాక్టర్లను కొంతమంది సర్పంచులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా చాలా గ్రామాల్లో  సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, ఇతర కాంట్రాక్టు పనులు సర్పంచులే చేస్తున్నారు. ఈ పనులకు అవసరమైన ఇసుక, కంకర, మొరం తరలింపునకు పంచాయతీల ట్రాక్టర్లను వాడుతున్నారని, క్యూరింగ్​ సమయంలో ట్యాంకర్లు సైతం పంచాయతీలవే వాడుతున్నారన్నది బహిరంగ రహస్యం.  

ఈ ఫోటోలో కనిపిస్తున్న నీటి ట్యాంకర్​ నిజామాబాద్​ మండలం లింగితండా పంచాయతీకి చెందినది.  కానీ ఈ పంచాయతీ కొత్తగా ఏర్పడడం, పన్నులు, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం పెద్దగా లేకపోవడంతో ట్రాక్టర్​ నిర్వహణ కష్టంగా మారింది.  ట్రాక్టర్​కిస్తీలు చెల్లించడం, డ్రైవర్, డీజిల్​, ఇతర ఖర్చులు తడిసిమోపెడు కావడంతో పంచాయతీ భరించలేక ఇదిగో ఇలా మూలన వదిలేశారు.


ఈ చిత్రంలో కనిపిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ మోపాల్​ మండలం కాస్బాగ్​తండా పంచాయతీకి చెందినది. నర్సింగ్​పల్లి పంచాయతీ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ ఈ గ్రామం చాలా చిన్నది కావడంతోపాటు విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. కానీ అధికారులు కచ్చితంగా ట్రాక్టర్​ కొనుగోలు చేయాలని చెప్పడంతో కిస్తీల రూపంలో కొనుగోలు చేశారు. కాని వీటి అవసరం ఎక్కువగా ఉండకపోవడం, నిర్వహణ భారం పెరగడంతో నిరుపయోగంగా మారింది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

నిజామాబాద్​ జిల్లాలో మొత్తం 530 పంచాయతీలుండగా ఇందులో 131 పచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీల్లో 90శాతం గిరిజన తండాలుండగా మిగితావి 500-నుంచి600 జనాభా ఉన్న చిన్నచిన్న పల్లెలు. పాత పంచాయతీల్లో సైతం దాదాపు 150 వరకు చిన్నచిన్న పంచాయతీలే ఉన్నాయి.  2019-–20 సంవత్సరంలో  దాదాపు రూ.11 లక్షల నుంచి రూ.12లక్షలను వెచ్చించి  530 పంచాయతీలు  ట్రాలీ, ట్యాంకర్ లతో కూడిన ట్రాక్టర్లను కొనుగోలు చేశాయి. ఐతే మేజర్​పంచాయతీలు,  మిగులు నిధులు ఉన్న పంచాయతీలు నగదు చెల్లించి కొనుగోలు చేశాయి. దాదాపు 140 పంచాయతీలు మాత్రం  కిస్తీల రూపంలో ట్రాక్లర్లను కొనుగోలు చేశాయి.