- ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్టల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
- పర్మిషన్లు ఉండవు.. సర్కార్కుఆమ్దానీ ఉండదు
- మామూళ్ల మత్తులో యంత్రాంగం
- ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్శివారులో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్టలను రాత్రిపూట జేసీబీలతో తవ్వుతూ వేల టిప్పర్‌లతో తరలిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకపోయినా, సర్కార్ఆదాయం కోత పడుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూముల్లోని గుట్టల నుంచి మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
రాత్రిళ్లు తవ్వకాలు.. తరలింపు
సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారాక పట్టణంలో నిర్మాణాలు పెరిగాయి. రగుడు, సర్థాపూర్, పెద్దూర్, కలెక్టరేట్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరుగా నడుస్తోంది. రియల్టర్లు వెంచర్ల ఏర్పాటుకు మట్టి తరలిస్తున్నారు. దీంతో రాత్రిళ్లు పెద్దూరు శివారులోని ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ కు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీ లీడర్ల అండదండలు ఉండడంతో మట్టి రవాణా సాఫీగా సాగుతోందని పెద్దూరు గ్రామస్తులు వాపోతున్నారు. సిరిసిల్ల రెండో బైపాస్ ప్రాంతంలో కొత్తగా వేసిన రోడ్ కు ఇరువైపులా ప్లాటింగ్ చేస్తున్నారు. ఎద్దుగట్టలో తవ్విన మట్టి ఈ వెంచర్‌కు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
చెక్‌డ్యాం పేరుతో తరలింపు
పెద్దూరు శివారులోని మైసమ్మ గుట్ట వెనుక మండేపల్లి–పెద్దూరు గ్రామాల మధ్య చెక్ డ్యాం, అదే గ్రామ శివారులో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల పేరిట పర్మిషన్లేకపోయినా కాంట్రాక్టర్లు ఈ గుట్టల మట్టి తరలిస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు ఇతర అవసరాలకు తోలకాలు చేస్తున్నారు. చెక్‌డ్యాంకు కేవలం వంద ట్రిప్పుల మట్టి సరిపోతుండగా వేల ట్రిప్పుల మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్లలో ఇసుక మాఫియాతో పాటు మట్టి మాఫియా నడుస్తోందని చర్చ జరుగుతోంది. మట్టి అక్రమ తోలకాలను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గుట్టలు గుల్లవుతున్నాయి. మరోవైపు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. మట్టి మాఫియా నుంచి మామూళ్లు అందుతుండడంతోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్
పెద్దూర్, సర్థాపూర్ శివారుల్లో అక్రమంగా వేల టిప్పర్లలో మట్టి తరలిపోతోంది. స్థానికంగా మేం గమనించి అధికారులకు ఫిర్యాదు చేసినా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు.
బర్కం నవీన్, పెద్దూర్స్థానికుడు
మట్టి తోలకాలకు పర్మిషన్లు లేవు
పెద్దూర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్టల నుంచి మట్టి తరలిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు విజిట్ చేశాం. మట్టి తవ్వకాలకు ఎలాంటి పర్మిషన్ఇవ్వలేదు. మట్టి తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
సైదులు, మైనింగ్ ఏడీ రాజన్న సిరిసిల్ల జిల్లా