అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం

జన్నారం, వెలుగు :  జన్నారం మండలంలోని రేండ్లగూడలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో  మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రేండ్లగూడ సమీపంలోని పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనికి తోడు గాలి వీయడంతో మంటలు గ్రామం వైపు పొలాల మీదుగా దూసుకొచ్చాయి. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ముడికె ఐలయ్య తన ఎకరం చేనులో సాగుచేసి ఒకే చోట కుప్ప పోసి ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు మంటలు అంటుకొని కాలిపోయాయి.

వ్యవసాయ బావుల వద్ద రైతు సందవేని లింగన్నకు చెందిన 15పైపులు, తొట్ల నారాయణకు చెందిన 30 పైపులు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అర్పివేశారు. అలస్యమైతే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు.

ఘటనా స్థలాన్ని ఏఈవో త్రిసంధ్య,ఫైర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, డీపీవో రమేశ్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఏఈవో త్రిసంధ్య తెలిపారు.