- జైలుకు పంపిన వారితో ఎలా పని చేయాలంటూ స్థానిక క్యాడర్లో ఆందోళన
నిజామాబాద్, వెలుగు: ఎంఐఎం బరిలో లేని చోట బీఆర్ఎస్ కు మద్దతివ్వాలనే మజ్లీస్ అధినేత నిర్ణయంతో స్థానిక క్యాడర్ అయోమయంలో పడ్డారు. జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో బరిలో నిలిచి సత్తాచాటాలని స్థానిక మజ్లీస్ నేతలు భావించగా, అధినేత అసదుద్దీన్ నిర్ణయంతో వారి ఆలోచనకు బ్రేక్‌పడినట్లు అయింది. బోధన్‌లో బరిలో నిలచి ఎమ్మెల్యే షకీల్‌ను ఓడిస్తామంటూ గతంలో అసదుద్దీన్ కామెంట్ చేసిన నేపథ్యంలో, పార్టీ బలంగా ఉన్న నిజామాబాద్ అర్బన్లోనూ క్యాండిడేట్‌ను నిలిపి సత్తా చాటాలని జిల్లా లీడర్లు భావించారు.
ఇదే ప్రతిపాదనను గతంలో ఓవైసీ ముందు ఉంచగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అప్పటి నుంచి స్థానిక క్యాడర్ బీఆర్ఎస్ నేతలతో అంటిముట్టనట్లు ఉంటూ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. మెదక్‌లో అసద్దుదీన్ చేసిన కామెంట్‌తో గందరగోళంలో పడ్డ మజ్లీస్ నేతలు, ఇటీవల మున్సిపల్ నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ నేతృత్వంలో హైదరాబాద్‌లో అసదుద్దీన్ తో భేటీ అయ్యారు. ఆ మీటింగ్‌లో బీఆర్ఎస్కు మద్దతుగా పనిచేయాలని ఓవైసీ తేల్చిచెప్పారు
జైలుకు పంపిన నేత కోసం కోసం పనిచేయాలా?
బోధన్ ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్పర్సన్తూము పద్మ, ఆమె భర్త శరత్‌రెడ్డి మధ్య రాజకీయ వైరం ఏర్పడగా, మజ్లిస్ నేతలు శరత్‌రెడ్డికి అండగా నిలిచారు. దీంతో వారు ఎమ్మెల్యే షకీల్‌కు టార్గెట్అయ్యారు. శరత్‌రెడ్డికి మద్దతుగా ఉన్న ఎంఐఎం నేతలే లక్ష్యంగా అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వారు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. జైల్లో ఉన్న తమ కార్యకర్తలను కలిసేందుకు వచ్చిన అసదుద్దీన్ సైతం ఎమ్మెల్యే షకీల్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల పార్టీ చీఫ్ బీఆర్ఎస్ కు సపోర్ట్చేయాలని ఆదేశించడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బోధన్ టౌన్లో మజ్లిస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఎన్నికలేవైనా వారి ప్రభావం ఉంటుంది.1990 దశకంలో మున్సిపల్ చైర్మన్‌కు ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లోనూ మజ్లిస్ చైర్మన్కుర్చీని గెలిచింది.
అర్బన్‌పై గట్టి వాణి వినిపించి..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 32 వేల ఓట్లు పొంది రెండో స్థానంలో నిలిచింది. గడిచిన తొమ్మిదేండ్లలో పార్టీ మరింత విస్తరించిందని లీడర్ల అంచనా. 60 డివిజన్లు ఉన్న నగర పాలిక సంస్థలో ఎంఐఎంకు16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కీలకమైన డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి చెందిన ఇద్రిస్‌ఖాన్ నిర్వహిస్తున్నారు. పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి పోటీ చేయాలని ఇది వరకు నిర్వహించిన రెండు సమావేశాల్లో తీర్మానించారు. తదుపరి కార్యాచరణ హుషారుగా ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్న వేళ అధినేత ఓవైసీ సైలెంట్ చేయడం వారికి నచ్చడం లేదు. నామినేషన్లకు ముందు సమావేశాన్ని ఏర్పాటు చేసి ధిక్కార స్వరం వినిపించాలని స్థానిక నేతలు భావిస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత విజయం కోసం మజ్లీస్కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. బోధన్‌లో షకీల్ విజయంలోనూ కీలకంగా వ్యవహరించాం. కానీ మా పార్టీ కార్యకర్తలపై కక్షగట్టి జైళ్లకు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే షకీల్‌పై మజ్లిస్ అభ్యర్థిని బరిలో నిలిపి, మా సత్తా చూపెడతాం. (ఎమ్మెల్యే షకీల్ పై హత్యాయత్నం కేసులో అరెస్టయి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మజ్లిస్ కార్యకర్తలను కలిసేందుకు వచ్చినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు)